టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. వారు మరో ఏడాది పాటు కొనసాగేందుకు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బృందం ఒప్పుకోలేదు. ఫలితంగా కొత్త సెలక్టర్‌ను ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ. ముఖ్యంగా ప్రసాద్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నట్టు సమాచారం.
ఈ నెల 1న... బీసీసీఐ 88వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గంగూలీ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. లోధా కమిటీ నిబంధనల్లో కొన్నింటిలో మార్పులు చేసేందుకు భారత క్రికెట్ బోర్డులోని సభ్యులంతా అంగీకరించారు. సుప్రీం అంగీకారం కోసం దాదా బృందం వేచి చూస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత సెలక్టర్ల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి నాలుగేళ్లకు తగ్గించేందుకు బీసీసీఐ కొత్త పాలకులు నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులోనూ సెలక్టర్ల పదవీకాలాన్ని నాలుగు నుంచి మూడేళ్లకు కుదించనున్నారు.
ఎమ్మెస్కేకు గుడ్‌బై
సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, సభ్యుడు గగన్ ఖోడా 2015లో బాధ్యతలు స్వీకరించారు. కమిటీలోని ఇతర సభ్యులు జతిన్ పరంజ్‌పే, శరన్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ.. 2016లో బాధ్యతలు అందుకున్నారు. బోర్డు రాజ్యాంగం ప్రకారం జాతీయ సెల్టెకర్ల పదవీ కాలాన్ని అప్పటి పరిపాలకుల కమిటీ (సీవోఏ) నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచింది. ఇందువల్లే మళ్లీ అదే స్థితిని పునరుద్ధరించాలని బీసీసీఐ అధ్యక్షుడు భావిస్తున్నాడు.
కొత్త వ్యక్తి ఇతడేనా?
బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ నియమితులవుతారని బోర్డు వర్గాల సమాచారం. ఇతడు భారత్ తరపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 26 వికెట్లు, వన్డేలలో 15 వికెట్లు తీశాడు.