న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఇరుజట్లు హోరాహోరీ తలపడటం వల్ల సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మెరుపులు జట్టుకు విజయాన్నిందించాయి. అయితే మ్యాచ్ అనంతరం సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఓ దశలో ఓడిపోతామని భావించామని అన్నాడు.
"ఓ దశలో మ్యాచ్ చేజారిందని అనుకున్నా. కేన్ విజృంభించిన తీరు చూసి వారు విజయానికి అర్హులని కోచ్‌తో చెప్పాను. కీలక సమయంలో మాకు అతడి వికెట్ లభించింది. కొన్ని బంతుల్ని ఆఫ్‌సైడ్ వేసి షమి మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. ఆఖరి బంతికి ఎలా బౌలింగ్ చేసినా సింగిల్ తీస్తారని మాకు తెలుసు. అందుకే నేరుగా వికెట్లకు విసరమని చెప్పాను. షమి అదే చేశాడు. టేలర్ ఔటయ్యాడు. మ్యాచ్ మలుపు తిరిగింది."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
సూపర్ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌ను విలియమ్సన్ చక్కగా ఎదుర్కొన్నాడని అన్నాడు కోహ్లీ. ఈ సిరీస్‌ను 5-0 తేడాతో గెలవడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు.
"సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ మళ్లీ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. విలియమ్సన్ చక్కని షాట్లు ఆడాడు. కానీ ఈ రోజు రోహిత్ మంచి టచ్‌లో కనిపించాడు. సగం ఓవర్ అయ్యాక రోహిత్ ఒక్క షాట్ బాదితే చాలు బౌలర్ ఒత్తిడిలోకి వెళ్తాడని అనుకున్నా. ఎందుకంటే అతడు అద్భుతంగా బంతిని బాదేస్తాడు. మొత్తంగా ఇదో చక్కని మ్యాచ్. ఆఖరి ఓవర్లో షమి ఆ రెండు బంతులకు పరుగులివ్వకుండా వికెట్ తీస్తే సూపర్‌ఓవర్‌కు వెళ్తామనుకున్నా. అందులో ఒత్తిడికి గురిచేస్తే కివీస్ గతి తప్పుతుందని భావించా. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ డెత్ స్పెషలిస్టుల్లో ఒకడైన బుమ్రా బౌలింగ్‌ను కేన్ చక్కగా ఎదుర్కొన్నాడు. మేం ఈ సిరీస్‌ను 5-0తో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు సైని, సుందర్ ఇంకా మరికొందరు ఆడలేదు. వారికో అవకాశం ఇవ్వాలి."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 179 పరుగులు చేసింది. ఛేదనలో చెలరేగిన విలియమ్సన్ (95), రాస్ టేలర్‌ను ఆఖరి ఓవర్లో షమి ఔట్ చేయడం వల్ల స్కోర్లు సమం అయ్యాయి. సూపర్ ఓవర్లో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రోహిత్ వరుస సిక్సర్లతో విజయం అందించాడు.
ఇవీ చూడండి.. అర్ధశతకం వల్లే సూపర్ ఓవర్లో ఛాన్స్: రోహిత్