పాకిస్థాన్లో క్రికెట్ పునరుద్ధరణకు పీసీబీ చేస్తోన్న కృషి ఫలిస్తోంది. ఇటీవలే శ్రీలంక.. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అయితే టెస్టులు ఆడేందుకు కొంత ఆలోచించిన లంకేయులు.. ఎట్టకేలకు అంగీకరించారు.
పాక్ గడ్డపై ఐదు రోజుల మ్యాచ్ ఆడేందుకు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుంది. ఫలితంగా దాదాపు దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు మజాను ఆస్వాదించనున్నారు పాక్ అభిమానులు.
"పాకిస్థాన్ క్రికెట్‌కు ఇదో నమ్మశక్యం కాని వార్త. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఈ దేశం సురక్షితం, భద్రతమైందన్న విశ్వాసం పెరుగుతోంది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం జట్టును పంపించేందుకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు."
-జకీర్ ఖాన్, పీసీబీ డైరెక్టర్
2009లో చివరగా శ్రీలంక.. పాక్‌లో పర్యటించింది. లాహోర్‌లో లంకేయులు ప్రయాణిస్తున్న వాహనంపై అప్పుడు బాంబుదాడి జరిగింది. అప్పటి నుంచి పాక్ వెళ్లేందుకు ఏ దేశమూ అంగీకరించలేదు.
ఇప్పుడు మళ్లీ శ్రీలంకే అక్కడ పర్యటించి కొత్త ఒరవడి సృష్టించింది. రావల్పిండి వేదికగా డిసెంబర్ 11-15 వరకు మొదటి టెస్టు, కరాచీ వేదికగా 19-23 మధ్య రెండో టెస్టు జరుగుతుంది.
ఇవీ చూడండి.. దిల్లీకి రహానే.. రాజస్థాన్ జట్టులోకి పృథ్వీషా!