ఠాకూర్ తిలక్‌వర్మ... రెండేళ్ల కిందటి వరకు ఎవరికీ తెలియని యువ క్రికెటర్. అలాంటిది ఏకంగా భారత అండర్-19 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జట్ల ఎంపికలో అనేక రాజకీయాలకు కేంద్రంగా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నుంచి.. ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు అత్యున్నత స్థాయికి చేరుకోవడం అద్భుతమే.
ఇదే తొలిసారి....
2017 హెచ్‌సీఏ లీగ్స్‌లో తొలిసారి తిలక్ పేరు వినిపించింది. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం, బాగా పరుగులు రాబడుతుండటం వల్ల అప్పటి సీనియర్ సెలెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి దృష్టిలో పడ్డాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన తిలక్‌లోని ప్రతిభను గుర్తించిన చక్రవర్తి అతడిని ప్రోత్సహించాడు. ఆ తర్వాత హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఎంపికయ్యే వరకు మార్గనిర్దేశం చేశాడు.
అఖిల భారత విజయ్ మర్చంట్ అండర్-16 క్రికెట్ టోర్నీలో తొలిసారిగా హైదరాబాద్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇందుకు ప్రధాన కారణం తిలక్ మెరుగ్గా రాణించడమే. ఆ మ్యాచ్‌ల్లో 690 పరుగులతో జాతీయ స్థాయిలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వద్దని గోల పెట్టారు...
2017లో మొయినుద్దౌలా గోల్డ్‌కప్ టోర్నీ. అప్పటి రంజీ ఛాంపియన్ విదర్భ, బరోడా, ఎయిరిండియా, గోవా, కేరళ వంటి జట్లు పాల్గొన్న టోర్నీలో.. హైదరాబాద్‌కు తిలక్‌ను ఎంపిక చేయడానికి పెద్ద యుద్ధమే జరిగింది. 15 ఏళ్ల కుర్రాడిని రంజీ ఛాంపియన్‌తో తలపడే జట్టుకు ఎలా ఎంపిక చేస్తారంటూ హెచ్‌సీఏ పెద్దలతో సహా అందరూ వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయినా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రమేశ్, సెలెక్టర్ చక్రవర్తి పట్టుబట్టి మరీ తిలక్‌ను హైదరాబాద్‌కు ఎంపిక చేశారు.
రంజీ శిబిరంలో రాయుడు, ఇతర సీనియర్ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేసిన తిలక్ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. అతడి బ్యాటింగ్ మరింత మెరుగైంది. గతేడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఈ యువ బ్యాట్స్‌మన్.. ఇటీవల విజయ్ హజారే టోర్నీలో బరిలో దిగి సత్తాచాటాడు.
అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. సీనియర్, అండర్-19 విభాగాల్లో నిలకడగా రాణిస్తున్న 17 ఏళ్ల తిలక్‌కు ఊహించినట్లే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అత్యంత కీలకమైన వన్‌డౌన్ స్థానంలో తిలక్ ఆడే అవకాశముంది. ఆఫ్ స్పిన్నర్‌గానూ రాణించగల సత్తా అతడి సొంతం.
రోజూ 80 కిలోమీటర్లు...
తిలక్ తండ్రి చిన్న కంపెనీలో చిరుద్యోగి. కోచ్ సలాం దగ్గర శిక్షణకు చేరినప్పుడు తిలక్‌కు పదేళ్లు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో సలాం ఇల్లు. 40 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లిలో అతని అకాడమీ. సలాంతో కలిసి రోజూ 80 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోచ్‌తోనే ఉంటూ క్రికెట్ నేర్చుకున్నాడు తిలక్. కుమారుడిలో ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తిలక్‌ను ప్రోత్సహించారు. కోచ్ పాఠాలు.. సెలెక్టర్ అండదండలతో అతితక్కువ కాలంలోనే తిలక్ ఈస్థాయికి చేరుకోగలిగాడు
లంకతో తొలి మ్యాచ్:
సఫారీ గడ్డపై జనవరి 9 నుంచి ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. 1988లో ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు విజేతగా నిలిచింది భారత్. ఇప్పడూ మంచి అంచనాలతోనే బరిలో దిగుతోంది. గత టోర్నీలో కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశంలో, కెప్టెన్ పృథ్వీ షా నాయకత్వంలో అదరగొట్టిన భారత్.. ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలిచింది. 2000, 2008, 2012లోనూ టీమిండియా కప్ గెలిచింది.
రాబోయే టోర్నీలో భారత్.. గ్రూప్-ఎలో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌తో కలిసి ఆడనుంది. జనవరి 19న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వేట మొదలుపెట్టనుంది.
ప్రపంచకప్‌కు భారత్ జట్టు:
ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ఠాగూర్ తిలక్‌వర్మ, యశస్వి జైస్వాల్, దివ్యాంశ్ సక్సేనా, ధ్రువ్ చంద్ జురెల్, షశ్వంత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభాంగ్ హెడ్గే, రవి బిష్ణోయ్, ఆకాశ్‌సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర, సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్