పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా హిందువు కాబట్టి.. అప్పటి జట్టులోని కొంతమంది ఆటగాళ్లు అతనిపై వివక్ష చూపారని దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆరోపించాడు. అతడితో కలిసి భోజనం కూడా చేసే వాళ్లు కాదని అన్నాడు. తన మామ అనిల్ దల్పాత్ తర్వాత పాక్ తరఫున ఆడిన రెండో హిందు ఆటగాడు కనేరియా. అతను 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టాడు.
"ప్రాంతీయ వాదం పేరు చెప్పి మాట్లాడే జట్టులోని కొంతమంది ఆటగాళ్లతో నేను విభేదించేవాణ్ని. కరాచి నుంచి ఎవరు ఉన్నారు.. పంజాబ్ లేదా పెషావర్ నుంచి ఎవరైనా ఉన్నారా? లాంటి మాటలు తీవ్రమైన కోపం తెప్పించేవి. జట్టు కోసం మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాడు హిందువు అయితే తప్పేంటి? అతనే లేకుంటే ఇంగ్లాండ్‌పై మేం టెస్టులు గెలిచేవాళ్లం కాదు. కానీ ఆ ఘనత అతనికి దక్కకుండా చేశారు."
-అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
అక్తర్ వ్యాఖ్యలను కనేరియా సమర్థించాడు. "ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేకపోయింది. ఇప్పుడు అక్తర్ చెబుతున్న మాటలు నిజం. అతనితో పాటు ఇంజమాముల్ హక్, మహమ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్ నాకు మద్దతుగా నిలిచేవాళ్లు" అని కనేరియా తెలిపాడు.
ఇవీ చూడండి.. గాల్లోకి షాట్లు కొట్టడం నేరం కాదు: రోహిత్