భారత్ నుంచి సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి అంపైర్ ఒక్కరైనా వస్తారని తాను అనుకోవడం లేదని మాజీ అంపైర్ సైమన్ టాఫెల్ అన్నాడు. ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌లోకి ఓ భారతీయుడు ప్రవేశించాలంటే కనీసం పదేళ్లు పడుతుందని, బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలని తెలిపాడు.
"భారత్ నుంచి ప్రపంచ స్థాయి అంపైర్ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారత్‌లో ఈ కార్యక్రమాన్ని 2006 నుంచి 2016 వరకు నిర్వహించాం. ఎలైట్ ప్యానెల్లోకి ఎస్.రవి అడుగుపెట్టేందుకు కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై మళ్లీ ఆలోచించాలి. ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు జరుగుతోందని అనుకోను. కానీ భారత్‌కు అంపైర్లు అవసరం" -సైమన్ టాఫెల్, మాజీ అంపైర్
బీసీసీఐ నూతన అధ్యక్షుడైన సౌరభ్ గంగూలీ ఈ అంశంపై దృష్టిపెట్టాలని అన్నాడు టాఫెల్.
"దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న గంగూలీ, ఈ విషయంపైనా దృష్టిసారించాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్స్ మేనేజర్, అంపైర్స్ కోచ్, అంపైర్స్ ట్రైనర్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలి. అందరూ సురక్షితంగా ఉండే, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థను ఏర్పాటు చేయాలి" -సైమన్ టాఫెల్, మాజీ అంపైర్
ఎస్.రవి.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లోకి 2015లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో అతడిని తొలగించారు. యాషెస్ సహా 33 టెస్టులు, 48 వన్డేలు, 18 టీ20లకు రవి అంపైరింగ్ చేశాడు.
ఇదీ చదవండి: వచ్చే ఐపీఎల్ తర్వాతే భవిష్యత్‌పై ధోనీ నిర్ణయం!