మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా టీమిండియా జట్టులో చోటు సంపాదించుకున్నాడు రిషబ్ పంత్. కానీ వరుస వైఫల్యాలతో తుదిజట్టులో చోటును ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లకు ప్రకటించిన ఆటగాళ్లలో మరో యువ కీపర్ సంజూ శాంసన్‌కూ అవకాశం కల్పించారు సెలక్టర్లు. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచకప్‌కు ముందు మాజీ ఆటగాళ్లు పంత్‌కు మద్దతుగా నిలిచారు. అతడిలో అద్భుత ప్రతిభ దాగుందని ఓ అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ మెగాటోర్నీలో ఫర్వాలేదనిపించిన పంత్, అనంతరం వెస్టిండీస్ పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చాడు. టీమిండియాకు ఎప్పటి నుంచో తలనొప్పిగా మారిన నాలుగో స్థానంలో రిషబ్‌ను పంపిస్తే అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు.
యువ ఆటగాడు కావడం.. అద్భుత ప్రదర్శన దాగి ఉండటం వల్ల తప్పుల నుంచి నేర్చుకుంటాడని అటు జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు ఇటు కెప్టెన్, కోచ్ పంత్‌ను వెనకేసుకొచ్చారు. అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లోనూ రిషబ్ ఆటతీరులో ఏమాత్రం మార్పు రాలేదు.
సాహా పునరాగమనం
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నుంచి పంత్‌ను తప్పించి అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహాకు చోటు కల్పించారు సెలక్టర్లు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాహా కీపర్‌గా సత్తాచాటాడు. వికెట్ల వెనక అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా ఈ ఆటగాడిపై ప్రశంసలు జల్లు కురిసింది. టెస్టుల్లో పంత్ స్థానం ప్రమాదంలో పడింది. ప్రస్తుతం టెస్టుల్లో సాహాను కాదని పంత్‌కు చోటిచ్చే పరిస్థితి లేదు.
శాంసన్ రాక
సుదీర్ఘ ఫార్మాట్లోనే కాక ఇప్పుడు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోనూ పంత్ స్థానం ఇరకాటంలో పడింది. అందుకు కారణం సంజూ శాంసన్. విజయ్ హజారే టోర్నీలో సంజూ 125 స్ట్రయిక్ రేట్‌తో 410 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉంది. ఫలితంగా శాంసన్‌కు బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు. ఇప్పుడు సంజూ రూపంలో పంత్‌కు గట్టి పోటీ తప్పేలా లేదు.
కానీ.. సెలక్టర్ల మాట మరోలా ఉంది. పంత్ కీపర్‌గా కొనసాగుతాడని.. శాంసన్ టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉపయోగపడతాడని అంటున్నారు. కానీ ఈ సిరీస్‌లో సంజూ సత్తాచాటి.. పంత్ విఫలమైతే పరిస్థితి శాంసన్‌కు అనుకూలంగా మారుతుందంటున్నారు క్రికెట్ పండితులు.
ఇవీ చూడండి.. బంగ్లాతో పోరు: కోహ్లీకి విశ్రాంతి.. సంజూ, దూబేలకు చోటు