అరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే టెస్టుల్లో వరుస సెంచరీలు బాది ఔరా అనిపించాడు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ లబుషేన్. త్వరలో టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పటికే ఆసీస్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లబుషేన్.. వన్డేల్లో రాణించడానికి స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్లను అనుసరిస్తానని చెప్పాడు.
"ఐదారేళ్లుగా స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా రాణిస్తున్నారు. వారిలాగా సత్తాచాటాలని అనుకుంటున్నా. కొంతకాలంగా బాగా ఆడుతున్నా. కానీ రానున్న సిరీస్‌ల్లోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తానని అనుకుంటున్నా. ఈ విషయం నాకు ఓ సవాలు లాంటింది"
-లబుషేన్, ఆసీస్ క్రికెటర్
టీమిండియా సిరీస్‌తో వన్డే అరంగేట్రం చేస్తున్న లబుషేన్.. ఇదొక కఠిన సవాలని అన్నాడు. భారత పిచ్‌లపై ఆడేందుకు తన వద్ద కొన్ని ప్రణాళికలున్నాయని చెప్పాడు.
"టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. భారత్ చాలా బలమైన జట్టు. ఈ ఛాలెంజ్‌ను ఆస్వాదిస్తా. భారత పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‌లో ఎలా ఆడతామన్నదే ఇక్కడ ముఖ్యం. అందుకోసం నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దానిపైనే నమ్మకం ఉంచుతా"
-లబుషేన్, ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఈనెల 14న ప్రారంభంకానుంది. ముంబయి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. 17న రాజ్‌కోట్ వేదికగా రెండో మ్యాచ్, 19న బెంగళూరు వేదికగా మూడు వన్డే నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి.. మైదానంలో చిన్నపిల్లల్లా కొట్టుకున్న ఆటగాళ్లు