మహేంద్రసింగ్ ధోనీ వారసుడిగా భారత జట్టులో అడుగుపెట్టిన రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ అంశంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ స్పందించాడు. మహీని భర్తీ చేయాలనే ఆలోచనతో పంత్ ఒత్తిడికి లోనవుతున్నాడని అన్నాడు.
"ప్రస్తుతం రిషభ్ పంత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు అతడికి మంచి అవకాశాలు కావాలి. ఈ విషయంపై ఇప్పటికే జట్టు యాజామాన్యంతో చర్చించా. పంత్ ప్రతిభ గల ఆటగాడు. ధోనీతో పోల్చడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడు." -ఎమ్ఎస్కే ప్రసాద్, టీమిండియా ప్రధాన సెలక్టర్.
పంత్ తిరిగి పుంజుకుంటాడన్న ఆత్మవిశ్వాసం తనకుందని చెప్పాడు ఎమ్ఎస్కే ప్రసాద్.
"మహీని అనుకరించకుండా సొంత ఆటను ఆడేందుకు రిషభ్ పంత్ ప్రయత్నించాలి. పదేహేనుళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్న మహీ తన కెరీర్ను ఎంతో కష్టపడి నిర్మించుకున్నాడు. అకస్మాత్తుగా పంత్.. ధోనీలా కావాలంటే కష్టం. మహీ ముసుగులోనుంచి బయటకు వచ్చి మళ్లీ పుంజుకుంటాడనే నమ్మకం నాకు ఉంది" - ఎమ్ఎస్కే ప్రసాద్, టీమిండియా ప్రధాన సెలక్టర్.
ఎమ్ఎస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఎవరేమనుకున్నా ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను గౌరవిస్తారని చెప్పాడు.
ఇదీ చదవండి: ఆ రెండు ఘటనలు ఎప్పటికీ మర్చిపోను: ధోనీ