రంజీ ట్రోఫీ మొదలైన తొలిరోజే మణిపుర్ బౌలర్ రెక్స్ సింగ్ అదరగొట్టాడు. మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్‌లో 22 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఫలితంగా మిజోరాం జట్టు 65 పరుగులకు ఆలౌటైంది. తరువార్ కోహ్లీ(34) ఒక్కడిదే అత్యుత్తమ స్కోరు .
రెక్స్ సింగ్ ధాటికి కేవలం 16 ఓవర్లలోనే మిజోరాం జట్టు ఆలౌటైంది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. గత డిసెంబరులో జరిగిన కూచ్ ట్రోపీలో 10 వికెట్లు తీసి అందరిని ఆకర్షించాడు రెక్స్ సింగ్.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మణిపుర్ జట్టు.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో ఉంది మణిపుర్. ఓపెనర్ చింగాంబామ్ సింగ్(89), రెక్స్ సింగ్(58) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మిజోరాం బౌలర్లలో బాబీ జోతాన్సంగా 4 వికెట్లు తీశాడు.
బౌలింగ్‌లో 8 వికెట్లుతో రాణించిన రెక్స్ సింగ్ బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 58 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇందులో 7 ఫోర్లు ఓ సిక్సర్ ఉంది.
ఇదీ చదవండి: 150 రంజీ మ్యాచ్‌లతో వసీం జాఫర్ రికార్డు