స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆడితేనే మ్యాచులు గెలవలేమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. వారిద్దరిపై జట్టు ఎక్కువగా ఆధారపడొద్దని సూచించాడు.
ప్రతిభావంతమైన క్రికెటర్లు ఎందరో ఉన్నప్పటికీ ఆర్‌సీబీ ఇప్పటివరకు ట్రోఫీ గెలవలేదు. ప్రతిసారీ "ఈసారి కప్పు మనదే" అంటూ రావడం నిరాశతో వెనుదిరడగం సర్వసాధారణంగా మారింది. 2016లో మాత్రం ఆ జట్టు రన్నరప్‌గా నిలిచి ఫర్వాలేదనిపించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం బెంగళూరు 13 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. తిరిగి తీసుకున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లలో అలీ ఒకరు.
"మాకు శుభారంభం అవసరం. మేమెప్పుడూ నిదానంగా జోరందుకుంటాం. ముఖ్యంగా సొంత మైదానంలో మేం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చిన్నస్వామి వికెట్ చాలా బాగుంటుంది. బౌండరీ సరిహద్దులు చిన్నవి. ఇది బౌలర్లను భయపెడుతుంది. మ్యాచులు గెలిచేందుకు మేం ప్రతిసారీ విరాట్, ఏబీ డివిలియర్స్‌పై ఆధారపడకూడదు. నాతో సహా కొత్తగా వచ్చే బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకోవాలి. చక్కగా బ్యాటింగ్ చేయాలి"
-మొయిన్ అలీ, ఆర్‌సీబీ ఆటగాడు
గతేడాది నిరాశపరిచిన గ్రాండ్‌హోమ్, హెట్‌మైయిర్, స్టాయినిస్ సహా 11 మందిని బెంగళూరు ఈ సారి విడుదల చేసింది.
ఇవీ చూడండి.. 'లిన్‌ను వదులుకోవడం కోల్‌కతా చేసిన తప్పిదం'