భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగవ్వాలంటే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వల్లే సాధ్యమని చెప్పాడు పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్. గతంలో ఇరుదేశాల మధ్య మ్యాచ్‌లు జరగని సమయమైన 2004లో దాదా సారథ్యంలోనే భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వచ్చిందని గుర్తుచేసుకున్నాడు.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సాయం చేయగలడని లతీఫ్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. దాయాది దేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనంతవరకు క్రికెట్ సంబంధాలు మెరుగవ్వవని, ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల క్రికెట్ మ్యాచ్‌లు చూడడానికి ఎదురు చూస్తుందని ఆయన చెప్పాడు.
పాక్ ముందడుగు వేయాల్సిందే..
భారత్తో మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీంఖాన్ కూడా తన వంతు కృషి చేయాలని సూచించాడు. అగ్ర జట్లు పాక్లో పర్యటించేలా సంప్రదింపులు జరపాలని కోరాడు. అలా చేస్తే స్థానిక ఆటగాళ్లకు, పాకిస్థాన్ క్రికెట్‌కు ఎంతో ఉపయోగమని లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
2004లో భారత్.. పాకిస్థాన్‌లో పర్యటించడానికి బీసీసీఐ నిరాకరించగా అప్పుడు గంగూలీనే చొరవ చూపాడు. ఆటగాళ్లను, బీసీసీఐని ఒప్పించి ఆ దేశంలో అడుగుపెట్టాడు. అక్కడ జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో, మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గంగూలీ నాయకత్వంలో టీమిండియా గెలుపొందింది. 2009లో ఉగ్రదాడి తర్వాత దాదాపు పదేళ్లకు పాకిస్థాన్‌లో టెస్టు క్రికెట్ ఆడింది శ్రీలంక జట్టు.