టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ ప్యానల్ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల గురించి మాట్లాడాడు ఎమ్మెస్కే. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను, భారత టెస్టు జట్టులోకి తీసుకోవడం తాము తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని అన్నాడు.
"బుమ్రా.. టెస్టు క్రికెట్ ఆడగలడని చెబితే చాలా మంది నమ్మలేదు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉంటే అద్భుతాలు చేయగలడని సెలక్టర్లతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ భావించింది. ఫిట్నెస్ కోసం పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చాం. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయడానికి ముందు అతడిని రంజీ ఆడేలా చేశాం. అప్పుడు బుమ్రాను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే ప్రణాళిక సిద్ధమైంది"
-ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్
వెన్నునొప్పి గాయంతో బుమ్రా.. స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. అనంతరం బీసీసీఐ అతడికి మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసింది. వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. 'మైదానంలో అడుగుపెట్టడం గొప్ప అనుభూతి'