కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది టీమిండియా. యువ క్రికెటర్లు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా బెంచ్ బలంగా తయారైంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలక్టర్లకు తలనొప్పి తీసుకొస్తున్నారు జట్టులోని మిగతా కుర్రాళ్లు. కానీ వచ్చినట్టే వచ్చి, జట్టులో స్థానం కోల్పోయిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తీరు మరో రకం. మేనేజ్మెంట్ ఎన్ని అవకాశాలు ఇచ్చినా, వాటికి న్యాయం చేయలేకపోయాడు. ఇప్పటికీ వారు పంత్ సామర్థ్యంపై నమ్మంతోనే ఉన్నారు. కానీ కివీస్‌తో జరుగుతోన్న సిరీస్‌లో రిషబ్‌ను ఆడించకపోవడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఇదే విషయమై యాజమాన్యాన్ని, కోహ్లీని ప్రశ్నించాడు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.
"జట్టుకు దూరంగా ఉంటే పరుగులు ఎలా సాధిస్తారు. బెంచ్‌లో సచిన్‌ను కూర్చోబెట్టినా పరుగులు సాధించలేక విఫలమవుతాడు. పంత్‌లో మీకు మ్యాచ్ విన్నర్ కనిపిస్తే అతడిని ఎందుకు ఆడించడం లేదు. అతడు స్థిరంగా ఆడట్లేదనా?"
-వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్
సారథిగా కోహ్లీ.. ఆటగాళ్లతో మాట్లాడటం చాలా అవసరమని అన్నాడు సెహ్వాగ్. లేకుంటే జట్టులో పొరపాట్లు రావచ్చని అభిప్రాయపడ్డాడు.
"మా సమయంలో కెప్టెన్ ఆటగాళ్లతో మాట్లాడాడా.? (ధోనీని ఉద్దేశిస్తూ). మరి కోహ్లీ అలా చేస్తున్నాడా.. లేదా..? నేను జట్టు కూర్పులో భాగస్వామిని కాదు. కానీ ఆసియా కప్ సమయంలో సారథిగా ఉన్న రోహిత్ శర్మ ఆటగాళ్లతో మాట్లాడినట్లు ప్రజలు అంటున్నారు."
-వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్
ధోనీ కెప్టెన్సీపైనా మాట్లాడాడు సెహ్వాగ్. తాము ఫీల్డింగ్ సరిగా చేయట్లేదని అతడు తమతో గానీ.. మీటింగ్‌లోని కానీ చెప్పలేదని.. నేరుగా మీడియాకు తెలిపాడని అన్నాడు. అప్పుడు రోహిత్ శర్మ కొత్త కుర్రాడని అందుకోసం అవకాశాలు ఇచ్చామని అన్నాడు. అందుకు రొటేషన్ పాలసీ ఉందని చెప్పాడు. కానీ ఆటగాళ్లతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు సెహ్వాగ్.
ఇవీ చూడండి.. కొత్త చీఫ్ సెలక్టర్ అతడే: గంగూలీ