మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడు? అతడెందుకు వీడ్కోలుపై పెదవి విప్పడం లేదు? ఇంకా ఎన్ని రోజులు క్రికెట్ ఆడతాడు? ఇలా చాలామంది ధోనీ రిటైర్మెంట్పై వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిపై గట్టిగా స్పందించాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. మహీ వీడ్కోలుపై మాట్లాడడం అతడిని అగౌరవపరిచినట్లేనని, అతడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పే హక్కు ఉందని విమర్శకులపై విరుచుకుపడ్డాడు.
"ధోనిపై కామెంట్ చేసేవారిలో సగం మందికి షూ లేస్ కట్టుకోవడం చేతకాదు. దేశం కోసం అతడు(మహీ) ఏం సాధించాడో చూడండి. అతడు వెళ్లాలని ఎందుకు అంత తొందరపడుతున్నారు. మహీ గురించి మాట్లాడేందుకు ఈ విషయం తప్ప వారికి ఇంకేమి దొరకలేదనుకుంటా. ఆటకు త్వరలోనే వీడ్కోలు పలకాలని ధోనీతో పాటు అందరికీ తెలుసు" - రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్.
మహీపై కామెంట్లు చేయడం అతడిని అవమానపరిచినట్లేనని అన్నాడు రవిశాస్త్రి.
"15 ఏళ్లపాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మహీకి ఎప్పుడు రిటైర్ అవ్వాలో తెలుసు. టెస్టులు నుంచి వైదొలిగినప్పుడు అతడు ఏమైనా చెప్పాడా.. ఆ నిర్ణయం తీసుకుని సాహాకు అవకాశం కల్పించాడు. జట్టుకు అతడో నీడలాంటి వాడు. ధోనీ వ్యూహాలు, ప్రణాళికలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ధోనీపై వ్యాఖ్యలు చేయడం.. అతడిని అగౌరవపరిచినట్లే" - రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్.
మహీ రిటైర్మెంట్పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ధోనీ చివరిగా ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. అనంతరం పారామిలిటరి దళంతో కలిసి ఆర్మీకి సేవలందించాడు. అందుకే వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌కూ ధోనీ అందుబాటులో లేడు. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ ధోనీ ఆడటం లేదు.
ఇదీ చదవండి: 3 సెకన్లలో 3 సార్లు ప్రయత్నం.. అయినా..!