గులాబి బంతితో పోరుకు ఒక్కరోజు మాత్రమే ఉంది. డేనైట్ విధానంలో తొలిసారి తలపడుతున్న టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. శుక్రవారం బంగ్లాతో జరగనున్న ఈ మ్యాచ్ గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు.
"రేపు చారిత్రక మ్యాచ్ ఆడనున్నాం. గులాబి బంతి టెస్టు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్ మాకు సవాల్‌తో కూడుకున్నది. ఈడెన్‌గార్డెన్ వేదికగా జరగనున్న ఈ టెస్టు చిరకాలం గుర్తుండిపోతుంది" - విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.
పింక్ బంతితో తను ఇప్పటివరకు ఆడలేదని అన్నాడు కోహ్లీ.
"గులాబి బంతితో ఆడిన అనుభవం నాతో పాటు చాలామందికి లేదు. టెక్నిక్‌లు ఎక్కువ ఉపయోగించి ఏకాగ్రతతో ఆడాలి. ఇది మాకు సవాలే. గులాబి రంగును గుర్తించి ఆడడం కొంచె కష్టం " - విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.
టెస్టు క్యాలెండర్‌పై ద్రవిడ్ చెప్పిన విషయాన్ని విరాట్ కూడా పునరుద్ఘాటించాడు.
"నా అభిప్రాయం ప్రకారం డే నైట్ మ్యాచ్.. టెస్టు ఫార్మాట్‌ను మారుస్తుందని అనుకోవడం లేదు. ద్రవిడ్ చెప్పిన ప్రకారం మాకు టెస్టు క్యాలెండర్ కావాల్సిందే" -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.
గులాబి బంతి బౌలర్లకు బాగా అనుకూలిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
"గులాబి బంతితో బౌలర్లు బాగా స్వింగ్ చేయగలరు. అది మాకు కలిసొచ్చే అంశం. డేనైట్ టెస్టులో వారు సత్తాచాటుతారు" -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ప్రస్తుతం శుక్రవారం ప్రారంభం కానున్న డే అండ్ నైట్ టెస్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. గులాబి బంతితో ఆడడం ఇరుజట్లకు ఇదే మొదటి సారి.
ఇదీ చదవండి: కొరియా మాస్టర్స్ నుంచి కిదాంబి శ్రీకాంత్ ఔట్