మానసిక ఆరోగ్య సమస్యలతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. అతడి నిర్ణయం అసాధారణమని ప్రశంసించాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో తానూ ఇలాంటి బాధనే అనుభవించానని తెలిపాడు.
"అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు జట్టులోని ప్రతి ఆటగాడికి భావప్రసారం అవసరం. అన్ని విషయాలు పంచుకోగలిగే సామర్థ్యం ఉండాలి. గ్లెన్ (మ్యాక్స్‌వెల్) చేసింది అసాధారణం. నా కెరీర్లో అలాంటి దశను నేనూ ఎదుర్కొన్న. ఇక ప్రపంచం ముగిసిపోయింది అనుకున్నా. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదు" అని 2014 ఇంగ్లాండ్ పర్యటన గురించి విరాట్ వివరించాడు.
"నిజంగా చెప్పాలంటే చేయడానికి మీకో (జర్నలిస్టులు) పనుంది. మాకూ ఓ పనుంది. మనందరం దానిపైనే దృష్టి పెట్టాలి. అవతలి వ్యక్తుల ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. మ్యాక్స్‌వెల్ తన నిర్ణయంతో ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. మన మనస్సు సరిగ్గా లేనప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒకానొక దశలో విసిగిపోతాం. అలాంటప్పుడు కొంత సమయం తీసుకోవడం అవసరం."
-విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
కోహ్లీ 11 ఏళ్ల కెరీర్‌లో 2014 ఇంగ్లాండ్ పర్యటన చాలా కష్టమైంది. ఈ సిరీస్‌లో కనీసం ఒక్క అర్ధశతకం చేయలేకపోయాడు. విపరీతంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.
"నిజాయతీగా చెబుతున్నా. నేను మానసికంగా పూర్తి ఆరోగ్యంగా లేనని, ఆట నుంచి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే దానిని ఎలా అంగీకరించాలో తెలియదు. ఆటను వదిలేయాలని నేను చెప్పను. ముందుకు సాగలేనప్పుడు, ఇబ్బందిగా అనిపించినప్పుడు మరింత స్పష్టత రావడానికి కొంతకాలం విరామం తీసుకోవడం మంచిదే. ఇలాంటి నిర్ణయాలను గౌరవించాలి. ప్రతికూలంగా భావించొద్దు. ఒక వ్యక్తిగా జీవితంలో కొన్ని పనులను సవ్యంగా నిర్వహించలేకపోవడమే ఇది. అందుకే దీనిని చాలా సానుకూలంగా తీసుకోవాలి."
-విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్
గతంలో కుంగుబాటు, మానసిక సమస్యలతో స్టీవ్ హార్మిసన్, మార్కస్ ట్రెస్కోథిక్, గ్రేమ్ ఫ్లవర్, సారా టేలర్ వంటి క్రికెటర్లు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
ఇవీ చూడండి.. టీ20: 12 హ్యాట్రిక్స్‌లో.. ఆరు ఈ ఏడాదే...