ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో తన ప్రదర్శనతో అదరగొట్టాడు భారత్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. అటు బ్యాటింగ్‌లో ఐదో స్థానంలో దిగి, 80 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్‌లోనూ సత్తా చాటాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్.. తను ఏ స్థానంలోనైనా దిగేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
"జట్టుగా ఆడేటపుడు, అందరూ దానికోసమే ఆడాలి. అలాంటి సమయంలో ఈ స్థానంలో రావాలనే నిబంధనలు ఏం నాకు లేవు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇది గొప్ప ఛాలెంజ్‌లా భావిస్తున్నా. ఒత్తిడికి లోనవకుండా, స్వేచ్ఛగా ఆడాలనే చూస్తా. ఆడటాన్ని ఆస్వాదిస్తా. ప్రిపరేషన్ కోసం పలువురు మిడిలార్డర్ క్రికెటర్ల వీడియోలు చూశా. వారిలో ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ ఉన్నారు. ఈ స్థానంలో ఎలా ఆడాలనే విషయమై కెప్టెన్ కోహ్లీతో ఎక్కువగా చర్చించా. అది చాలా ఉపయోగపడింది" -కేఎల్ రాహుల్, టీమిండియా క్రికెటర్
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం(19న) బెంగళూరులో జరగనుంది. గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది.