పంత్ ఆటతీరు మార్చుకోకుంటే వేటు తప్పదని రవిశాస్త్రి గతంలో సూటిగా చెప్పాడు. అన్నట్లుగానే కేఎల్ రాహుల్ జట్టులోకి కీపర్‌గా, బ్యాట్స్‌మన్ రావడం వల్ల అతడి స్థానానికి దెబ్బ పడింది. ఈ యువ ఆటగాడు జాగ్రత్త పడాలని, కాస్త ఓపికతో, ఏకాగ్రతతో ఆడాలని కోహ్లీ ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోలేదేమో.. అందుకే పంత్‌కు తాజాగా కేన్ విలియమ్సన్తోనూ చిన్నపాటి సూచనలు ఇప్పించాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదో టీ20లో ఈ ఇద్దరు సారథుల పక్కన కూర్చొని మ్యాచ్ వీక్షించాడు రిషభ్. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లతో కలిసి వాటర్ బాయ్‌గానూ పనిచేశాడు. ఈ సమయంలో ఇద్దరి మాటలు శ్రద్ధగా వింటూ కనిపించాడు.
ప్రపంచకప్‌లో చోటు కష్టమే..!
ధోని రిటైర్మెంట్ చర్చ మొదలైప్పటి నుంచి అతడి వారసుడిగా ఎక్కువమంది భావించిన పేరు రిషభ్ పంత్‌దే. ఐపీఎల్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత క్రికెట్ అభిమానుల మనసులు దోచాడతను. సెలక్టర్లను మెప్పించి తక్కువ వయసులోనే టీమిండియాలోకి వచ్చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలందుకున్నాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కంటే ముందు టెస్టుల్లో అవకాశమందుకుని సాహా స్థానానికి చెక్ పెట్టిన పంత్.. తర్వాత వన్డేలు, టీ20ల్లోనూ అవకాశాలందుకున్నాడు.
ఆ తర్వాత ప్రపంచకప్ సహా పలు సిరీస్‌ల్లో చోటు దక్కించుకున్న పంత్... బ్యాటింగ్, కీపింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఫలితంగా భారత జట్టు అభిమానుల నుంచి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా పరిస్థితి మారింది. కేఎల్ రాహుల్ బ్యాట్, గ్లవ్స్తోనూ సత్తా చాటుతున్నాడు. ఇతడి రాకతో పంత్ స్థానానికి ఎసరు పడింది. ప్రస్తుతం బెంచ్‌కే పరిమితమైన ఈ యువ ఆటగాడు.. టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం చాలా కష్టపడాల్సి ఉంది. ఐపీఎల్‌లో ధోనీ కూడా రాణిస్తే కచ్చితంగా చోటు కోల్పోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. మరి ఇలాంటి సమయంలో తన ఆటతీరు, ప్రదర్శన మార్చుకోవాల్సి ఉంది.