అంతర్జాతీయ క్రికెట్లో తనదైన దూకుడుతో దూసుకెళ్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇప్పటికే అత్యధిక శతకాలతో దిగ్గజ సచిన్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న మూడో వన్డేలో సత్తాచాటితే విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించే అవకాశముంది.
రెండు మ్యాచ్‌ల్లో 4 పరుగులే
విరాట్ కోహ్లీ.. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి 5 బంతులు ఎదుర్కొని 4 పరుగులే చేశాడు. అవి కూడా చెన్నై మ్యాచ్‌లోనే తీశాడు. విశాఖపట్నం వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గత రెండేళ్లుగా వన్డేల్లో లీడింగ్ స్కోరర్‌గా ఏడాదిని ముగిస్తున్నాడు కోహ్లీ. 2017లో 1460 పరుగులు చేసిన విరాట్.. గతేడాది 1202 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ(1427), షాయ్ హోప్(1303).. విరాట్ కోహ్లీ(1292) కంటే ముందున్నారు.
సత్తాచాటితే కలిస్ రికార్డు బ్రేక్
మరో 56 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించనున్నాడు కోహ్లీ. 240 వన్డేల్లో 60.02 సగటుతో 11524 పరుగులు చేశాడు టీమిండియా సారథి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలిస్.. 328 మ్యాచ్‌ల్లో 11579 పరుగులతో ఇతడి కంటే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సత్తాచాటితే కలిస్ రికార్డు బద్దలు కానుంది.
కటక్‌లో పేలవ రికార్డు
స్వదేశం, విదేశం అని చూడకుండా ఎక్కడైనా చెలరేగిపోయే కోహ్లికి.. కటక్‌లోని బారాబతి స్టేడియంలో పేలవ రికార్డుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడ ఆడిన నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి అతను కేవలం 34 పరుగులే చేశాడు. మూడు వన్డేల్లో వరుసగా 3, 22, 1 పరుగులు చేసిన విరాట్.. ఏకైక టీ20లో 8 పరుగులకే పరిమితమయ్యాడు. కనీసం మూడు మ్యాచ్‌లు ఆడిన భారత వేదికల్లో ఇంకెక్కడా విరాట్‌కు ఇంత పేలవమైన ట్రాక్ రికార్డు లేదు. మరి వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్.. లెక్కలు సరిచేసే ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి.
రెండేళ్లుగా 50కు పైగా సగటు
అంతేకాకుండా గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్న బ్యాట్స్‌మన్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ సగటు 60.02.. టెస్టుల్లో 54.97, టీ20ల్లో 52.66తో ఆకట్టుకుంటున్నాడు.
కోహ్లీ కాకుండా 50కు పైగా సగటుతో ఆడిన క్రికెటర్లు
- మ్యాథ్యూ హేడెన్(ఆస్ట్రేలియా)-2007
- ఆండ్రూ సైమండ్స్(ఆస్ట్రేలియా)- 2007
- కుమార సంగక్కర(శ్రీలంక)-2013
- స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 2016
- కేఎల్ రాహుల్(భారత్)- 2016
- ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా)- 2017
కటక్‌లో నేడు(ఆదివారం) వెస్టిండీస్‌తో భారత్ నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో విండీస్, రెండో దానిలో కోహ్లీసేన విజయం సాధించింది. ఆఖరి పోరులో గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
ఇదీ చదవండి: "సచిన్.. సచిన్" అని తొలిసారి పిలిచింది ఎవరంటే?