భారత్‌లో త్వరలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పర్యటించనుంది. 3 టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. వచ్చే నెల 3న దిల్లీ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని తెలిపాయి.
"దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నుంచి అనుమతి లభించింది. నవంబర్ 3 నాటికి దిల్లీలో కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని వారు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో తొలి టీ20ను యధావిధిగా నిర్వహిస్తాం. ప్రస్తుతానికైతే మార్పులు లేవు" -బీసీసీఐ వర్గాలు
గాలి నాణ్యత, వాతావరణ అంచనా, అధ్యయన వ్యవస్థ ప్రకారం సోమవారం ఉదయం దిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాద స్థాయికి పడిపోయింది. దీపావళి రోజు బాణాసంచా పేలుళ్లతో ఈ పరిస్థితి తలెత్తింది.
2017 డిసెంబర్‌లో ఇదే మైదానంలో జరిగిన భారత్-శ్రీలంక టెస్టులో లంక ఆటగాళ్లు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. కాలుష్య స్థాయి పెరగడం వల్ల మాస్క్‌లు ధరించి మ్యాచ్ ఆడారు. అయితే శీతాకాలంలో దిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించొద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ రొటేషన్ ప్రకారం బంగ్లా మ్యాచ్‌ను కేటాయించక తప్పలేదు.
ఇది చదవండి: తొలి టీ20కి మాస్కులతో బరిలోకి బంగ్లా ఆటగాళ్లు!