వాంఖడే వేదికగా ఈరోజు భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఇందులో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇటీవలే టీ20ల్లో అత్యధిక పరుగుల రారాజుగా నిలిచిన కోహ్లీ... ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే సచిన్ సరసన నిలుస్తాడు.
కెరీర్‌లో 463 వన్డేలాడిన సచిన్ తెందూల్కర్... 49 సెంచరీలు సాధించాడు. ఇందులో 20 శతకాలు భారత్ గడ్డపై చేసినవే. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇప్పటికి 242 వన్డేలు ఆడి... 43 శతకాలు నమోదు చేశాడు. ఇందులో 19 సెంచరీలు సొంతగడ్డపై సాధించాడు. ఫలితంగా నేటి మ్యాచ్‌లో విరాట్ మరో శతకం చేస్తే.. 20 శతకాలతో సగర్వంగా సచిన్ సరసన కోహ్లీ నిలవనున్నాడు.
ఇరు జట్ల మధ్య అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ సచిన్ తొలి స్థానంలో నిలవగా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మెన్
- సచిన్ : 71 మ్యాచ్‌ల్లో 9 శతకాలు
- విరాట్ కోహ్లీ : 37 మ్యాచ్‌ల్లో 8 శతకాలు
- రోహిత్ శర్మ : 37 మ్యాచ్‌ల్లో 7 శతకాలు
- రికీ పాంటింగ్ : 59 మ్యాచ్‌ల్లో 6 శతకాలు
- వీవీఎస్ లక్ష్మణ్: 21 మ్యాచ్‌ల్లో 4 శతకాలు
అత్యుత్తమ బ్యాట్స్‌మన్...
>> వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన పరుగులు 4889. మరో 111 పరుగులు సాధిస్తే 5వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఎనిమిదో కెప్టెన్‌గా నిలుస్తాడు. గతంలో టెస్టుల్లో 5వేల రన్స్, అంతర్జాతీయ కెరీర్‌లో 11వేల పరుగులు వేగంగా చేసిన సారథిగానూ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
>> వాంఖడే స్టేడియంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 87.9. ఈ వేదికపై 13 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 879 పరుగులు సాధించాడు. వాటిలో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఢాకా (1258), విశాఖపట్నం (879) స్టేడియాల్లో మాత్రమే కోహ్లీ 800 పైగా పరుగులు సాధించాడు.
>> 2016లో వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కోహ్లీ 235 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 121 పరుగులు చేశాడు. టెస్టు, వన్డేల్లో భారత్ తరపున ఈ స్టేడియంలో ఇవే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్లు.