తొలి టీ20లో వెస్టిండీస్‌పై రికార్డు ఛేదనతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. తిరువనంతపురం వేదికగా నేడు.. రెండో టీ20లో తలపడనుంది. ఇందులోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విండీస్ భావిస్తోంది.
తొలి టీ20లో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 బంతులు మిగిలుండగానే ఛేదించి గెలిచింది కోహ్లీ సేన. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ భారత్‌కు బలంగా మారింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తొలి మ్యాచ్ తరహాలోనే రాణించాలని భావిస్తున్నారు. మిగతా వారు.. అవకాశం దొరికితే తమ వంతు పాత్ర పోషించాలని తహతహలాడుతున్నారు.
తొలి మ్యాచ్‌లో విజయం సాధించినా భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో లోపాలు కనబడ్డాయి. టీమిండియా ఫీల్డర్లు 4 క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఈ తప్పు మళ్లీ జరగకూడదని భారత్ భావిస్తోంది. బౌలర్ దీపక్ చాహర్‌కు మరింత కచ్చితత్వం అవసరం. భువీ త్వరగా లయ అందుకోవాలి. చాహల్, వాషింగ్టన్ సుందర్ రాణించాల్సినా అవసరముంది.
విండీస్.. తొలి మ్యాచ్ ఓటమిపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. తమపై వరుసగా ఏడోసారి విజయం సాధించిన టీమిండియాపై కసితో రగిలిపోతోంది. బ్యాటింగ్‌లో కరీబియన్లకు తిరుగులేకున్నా.. బౌలింగ్ మాత్రం బలహీనంగా ఉంది. గత మ్యాచ్‌లో ఏకంగా 23 పరుగులు ఎక్స్‌ట్రాలు రూపంలో ఇచ్చారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది.