డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సమరాన్ని షురూ చేయనుంది టీమిండియా. అయితే ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వేదికను మార్చింది బీసీసీఐ. తొలి టీ20ని ముంబయి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా వేదికను హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియానికి మార్చినట్లు అధికారులు తెలిపారు.
తొలుత వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించాలనుకున్నారు. అంబేడ్కర్ వర్థంతి (మహాపరినిర్వాణ్ దివస్) సందర్భంగా భద్రత కల్పించలేమని వేదికను మార్చాలని మహారాష్ట్ర క్రికెట్ సంఘాన్ని(ఎమ్సీఏ) ముంబయి పోలీసులు అడిగారు. ఈ కారణంగా మ్యాచ్ హైదరాబాద్‌కు తరలింది.
డిసెంబరు 11న జరగనున్న చివరి టీ20కి ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లో నిర్వహించనుండగా.. రెండో టీ20 కేరళ తిరువనంతపురంలో జరగనుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ.. మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా గాయం నుంచి కోలుకొని జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు.
విండీస్‌తో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకోని కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని యువ క్రికెటర్ సంజు శాంసన్ భర్తీ చేయనున్నాడు.
ఇదీ చదవండి: 2023 పురుషుల హాకీ ప్రపంచకప్‌కు ఒడిశా ఆతిథ్యం