ప్రతిష్ఠాత్మక డే/నైట్ టెస్టుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వచ్చిన భారత్.. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడైనా తర్వాత వెంటనే ఒప్పుకుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అంతే వేగంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ మ్యాచ్ గురించి ప్రముఖ క్రికెటర్లతో సహా మాజీలు చేసిన వ్యాఖ్యలు ఓసారి పరిశీలిద్దాం.
కోహ్లీ-టీమిండియా కెప్టెన్
"ఈ మ్యాచ్ మాకు సవాల్‌తో కూడుకున్నది. చిరకాలం గుర్తుండిపోతుంది. గులాబి బంతితో ఫీల్డింగూ సవాలే. ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్స్‌లో బంతిని అందుకుంటే బరువైన హాకీ బాల్‌లా గట్టిగా తగిలింది. బంతిపై ఉన్న అదనపు మెరుపే అందుకు కారణం. కారణమేంటో తెలియదు కానీ బరువుగానూ అనిపిస్తోంది. వికెట్‌కీపర్‌కు అందించడానికి ఎర్ర బంతి కంటే ఎక్కువ బలం ఉపయోగించి త్రో చేయాల్సి వస్తోంది. పగటి పూట బాగా పైకి వెళ్లిన బంతులను క్యాచ్ పట్టడం చాలా కష్టమవుతుందని అనుకుంటున్నా. అదనపు మెరుపు వల్ల బంతి వేగం పెరిగింది. " -కోహ్లీ
మొమినుల్ హక్-బంగ్లాదేశ్ కెప్టెన్
"గులాబి బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే అవకాశం మాకు రాలేదు. మానసికంగా సిద్ధం కావడమే మేం చేయగలిగింది. ఎప్పుడు గులాబి బంతితో టెస్టు మ్యాచ్ ఆడినా.. అంతకన్నా ముందు అదే బంతితో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలి. డే/నైట్ టెస్టు అందరికీ కొత్తే. మేం బాగానే సన్నద్ధమయ్యాం. దాన్ని ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాం. తొలి గులాబీ టెస్టు ఆడాలనే ఉత్సుకతతో ఉన్నాం" -మొమినుల్
హర్భజన్ సింగ్-భారత సీనియర్ క్రికెటర్
"గులాబి బంతి సీమ్‌ను బ్యాట్స్‌మెన్ పసిగట్టడం కష్టం. మణికట్టు స్పిన్నర్లకిది సానుకూలాంశం. ఆఫ్ స్పిన్నర్లతో పోలిస్తే వాళ్ల బంతుల్ని అంచనా వేయడం ఇబ్బందే. దులీప్ ట్రోఫీ సందర్భంగా గులాబి బంతితో మ్యాచ్ ఆడినపుడు మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ బౌలింగ్‌ను అంచనా వేయడం బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టమైంది. డే/నైట్ టెస్టులో సాయంత్రం 3.30-4.30 మధ్య పిచ్.. పేసర్లు అనుకూలిస్తుంది" -హర్భజన్ సింగ్
గౌతమ్ గంభీర్-భారత సీనియర్ క్రికెటర్
"ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు, పేసర్లు ఉన్నారు. మిగతా జట్లను గమనిస్తే పేస్ బౌలింగ్‌లోనో, స్పిన్ విభాగంలోనో మెరుగ్గా ఉన్నాయి. కానీ భారత్ మాత్రం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో దుర్భేద్యంగా ఉంది" - గౌతమ్ గంభీర్
చతేశ్వర్ పుజారా-భారత క్రికెటర్
"నేను గతంలో దులీప్ ట్రోఫీలో గులాబి బంతితో ఆడా. ఆ అనుభవమే సహకరిస్తుందని అనుకుంటున్నా. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కొంచెం ఇబ్బంది తలెత్తొచ్చు. గులాబి బంతితో ఆడడం కొత్త ఛాలెంజ్. చాలా మంది క్రికెటర్లు ఈ బంతితో తొలిసారి ఆడనున్నారు. ఓపెనర్లు శుభారంభాన్ని అందిస్తే జట్టు భారీ స్కోరు సాధిస్తుంది" -చతేశ్వర్ పుజారా
సచిన్ తెందూల్కర్-దిగ్గజ క్రికెటర్
"కొత్త ప్రయోగాలు అవసరమే. ఆ తర్వాత మ్యాచ్ ఎలా సాగిందో సమీక్షించాలి. మంచు ఎంత కురిసింది, ఆట ప్రమాణాల ప్రకారం సాగిందా, రాజీ పడ్డారా వంటివి విశ్లేషించుకోవాలి. గులాబి బంతితో ప్రయోజనాలూ, ప్రమాదాలూ ఉన్నాయి. మ్యాచ్ ఆరంభమైన తర్వాత బంతి తడిచి, మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తే ఏం చేయాలో ఆలోచించుకోవాలి. మంచు కురిసి మ్యాచ్ ప్రమాణాల ప్రకారం సాగకపోయినా మాట్లాడుకోవాలి" -సచిన్ తెందూల్కర్
డీన్ జోన్స్-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
"రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా గులాబి టెస్టులదే. ప్రస్తుతం ప్రజలు బిజీగా గడుపుతున్నారు. గులాబి టెస్టులకు ఆస్ట్రేలియాలో రేటింగ్స్ బాగున్నాయి. సంప్రదాయ టెస్టులతో పోలిస్తే ఎంత భారీస్థాయిలో ఉన్నాయో చెప్పలేను. బిజీగా ఉండటం వల్ల పగటి పూట టెస్టు క్రికెట్ చూడటం జనాలకు కష్టమవుతోంది. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలవాటు పడితే సులభంగానే ఉంటుంది" -డీన్ జోన్స్
రసెల్ డొమింగో-బంగ్లాదేశ్ కోచ్
"టీమిండియా బలమైన జట్టని మాకు తెలుసు. వాళ్లు ప్రపంచ నెంబర్ వన్ జట్టు కావచ్చు. కానీ పింక్ బంతితో ఆడిన అనుభవం వారికి లేదు.. మాకూ లేదు. అయితే ఇది మాకు గొప్ప అవకాశం. ఈ మ్యాచ్ మాకు కలిసొచ్చే అవకాశముంది. ఈడెన్ గార్డెన్స్‌లో భారీ సందడి నెలకొనబోతుంది. అన్ని ఫార్మాట్లలో మేటి జట్టయిన టీమిండియాతో తలపడబోతున్నాం" -రసెల్ డొమింగో
ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 3 నుంచి 3:40 వరకు లంచ్ విరామం. సాయంత్రం 5:40 నుంచి 6 వరకు టీ బ్రేక్ ఉంటుంది.