రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో శిఖర్ ధావన్(96) కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు. కేన్ రిచర్డ్సన్ బౌలింగ్‌లో షాట్ కొట్టగా బౌండరీలైన్ వద్ద స్టార్క్ బంతిని ఒడిసి పట్టాడు. ఫలితంగా 103 పరుగుల కోహ్లీ - ధావన్ భాగస్వామ్యానికి తెరపడింది.
మొదట్లో ధాటిగా ఆడిన గబ్బర్.. అనంతరం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఓవర్లోనే చూడచక్కని స్ట్రైట్ డ్రైవ్ కొట్టి బౌండరీ సాధించాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. అగర్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ కొట్టి 90ల్లో అడుగుపెట్టిన ధావన్.. రిచర్డ్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. శిఖర్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.
గత ఐదు వన్డేల్లో రెండు సెంచరీలు
ఆసీస్‌తో ఆడిన గత ఐదు వన్డేల్లో, ధావన్ రెండు శతకాలు, రెండు అర్ధసెంచరీలు చేశాడు. 143, 12, 117, 74, 50*తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో 96 పరుగుల వద్ద ఔటై, శతకం చేజార్చుకున్నాడు.
కాసేపటికే శ్రేయస్ అయ్యర్.. ఆడం జంపా చేతిలో బౌల్డయ్యాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. కోహ్లీ అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు.
ఇదీ చదవండి: భారత్X ఆస్ట్రేలియా: రెండో వన్డేలో ధావన్ అర్ధశతకం