ప్రతిష్టాత్మక దేవధర్ ట్రోఫీ విజేతగా 'భారత్ బీ' జట్టు నిలిచింది. రాంచీ వేదికగా 'భారత్ సీ'తో జరిగిన ఫైనల్లో 51 పరుగుల తేడాతో నెగ్గింది. పార్థివ్ పటేల్ సారథ్యంలోని 'భారత్ బీ' మొదట బ్యాటింగ్ చేసి... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. కేదార్ జాదవ్(86), యశస్వీ జైస్వాల్(54) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 'భారత్ సీ' బౌలర్లలో ఇషాన్ పోరెల్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
284 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన 'ఇండియా సీ' జట్టు ఆరంభంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియమ్ గార్గ్ (74) అద్భుతంగా ఆడాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28) పర్వాలేదనిపించాడు. అయితే జట్టు స్కోరు 56 వద్ద మయాంక్‌ను బోల్తా కొట్టించాడు నదీమ్.
ఆ తర్వాత ఇండియా-సీ వరుసగా వికెట్లు చేజార్చుకొని 77/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అక్షర్ పటేల్ (38), జలజ్ సక్సేన (37*), మయాంక్ మార్కండె (27) ఆచితూచి ఆడారు. ఓ వైపు చేయాల్సిన రన్‌రేట్ పెరగడం, బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం వల్ల ఇండియా సీ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్..
అతి తక్కువ వయసులోనే ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోఫీ ఫైనల్లో ఓ జట్టుకు సారథ్యం వహించాడు గిల్. 20ఏళ్ల 57 రోజుల వయసున్న శుభ్‌మన్... 'ఇండియా సీ' బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతకుముందు 2009-10లో నార్త్‌జోన్‌కు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ (21 ఏళ్ల 142 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది.
ఇదీ చదవండి: ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్...