అండర్-23 క్రికెటర్లు ఇద్దరు.. ఓ మహిళ వెంటపడి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా బంగాల్‌తో మ్యాచ్ కోసం దిల్లీ అండర్-23 జట్టు కోల్‌కతాకు వెళ్లింది. ఓ హోటల్‌లో బస చేసింది. క్రిస్మస్ సందర్భంగా ముందురోజు సాయంత్రం అక్కడ జరిగిన వేడుకలో క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, లక్ష్య థరేజా ఓ అమ్మాయి వెంట పడ్డారని సమాచారం.
గది వరకు ఆమెను వెంబడించడమే కాకుండా లోపలికెళ్లి గడియ పెట్టుకున్నా, పదేపదే తలుపుతట్టి వేధించినట్లు హోటల్ అధికారులకు ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంటనే దిల్లీ జట్టు యాజమాన్యం రంగంలోకి దిగి... ఇద్దరు క్రికెటర్లను జట్టు నుంచి తొలగించి, వేరే హోటల్‌కు పంపించింది. వారి స్థానాల్లో ఇతరులను ఎంపిక చేయగానే దిల్లీ వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. అయితే ఆమె ఆటగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల వారిద్దరిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. విషయం తెలుసుకున్న దిల్లీ జట్టు డైరెక్టర్ సంజయ్ భరద్వాజ్.. కోల్‌కతాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆటగాళ్లు ఆ ఉద్యోగినికి క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.
పంజాబ్‌తో తర్వాత జరిగే రంజీ మ్యాచ్‌కు ఇషాంత్ స్థానంలో కుల్దీప్ను ఎంపిక చేశారు. ఇప్పుడు అతడిపై దిల్లీ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.