న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించి.. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 279 పరుగుల తేడాతో నెగ్గింది ఆసీస్. తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్(215) ద్విశతకంతో విజృంభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్(111) సెంచరీతో అదరగొట్టాడు. 415 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 136 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు నాథన్ లియోన్ 5 వికెట్లతో ఆకట్టుకోగా.. స్టార్క్ 3 వికెట్లు తీశాడు. లబుషేన్.. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డూ దక్కించుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 40/0 స్కోరు వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. రెండు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. వార్నర్ శతకంతో అదరగొట్టి.. కెరీర్లో 23వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన లబుషేన్ 59 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, టాడ్ ఆస్లే చెరో వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 454 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం బరిలో దిగిన కివీస్ 256 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ స్పిన్నర్ లియోన్(5/68, 5/50)రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదేసి వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: కార్చిచ్చు బాధితుల కోసం వార్న్ క్యాప్ వేలం