ఇటీవలే జరిగిన ఫ్రెంచ్, చైనా, హాంకాంగ్ ఓపెన్‌ల్లో విఫలమైన భారత షట్లర్లు.. కొరియా మాస్టర్స్‌లో మెరిశారు. గ్వాంగ్జు వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ.. రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
శ్రీకాంత్.. హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్‌పై 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన తెలుగు తేజం.. మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. వీరిద్దరూ 14 సార్లు ముఖాముఖి తలపడితే 11 సార్లు శ్రీకాంత్‌దే విజయం. తర్వాతి మ్యాచ్‌లో జపాన్ షట్లర్ కాంటా సునేయామాతో తలపడనున్నాడు.
గాయంతో ప్రత్యర్థి ఔట్
మరో షట్లర్ సమీర్ వర్మ.. జపాన్ ప్లేయర్ ఖాజుమాసా సాకాయ్పై పైచేయి సాధించాడు. గాయం కారణంగా ప్రత్యర్థి.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం వల్ల తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు సమీర్.
సౌరభ్ వర్మ ఇంటిముఖం..
పురుషుల సింగిల్స్‌లో సమీర్, శ్రీకాంత్ తర్వాతి రౌండ్‌కు చేరుకోగా.. సౌరభ్ వర్మ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. లోకల్ ఫెవరెట్ కిమ్ డోంఘన్ చేతిలో 21-13, 12-21, 12-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.
ఇదీ చదవండి: శృంగార తార సన్నీ లియోనీ... సాకర్ ఆడింది