ఫ్రెంచ్, చైనా, హాంకాంగ్ ఓపెన్.. ఇలా వరుస టోర్నీల్లో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టిన భారత షట్లర్లు.. తాజాగా కొరియా మాస్టర్స్‌లోనూ నిరాశపరిచారు. పురుషుల సింగిల్స్‌లో మిగిలిన ఏకైక ప్లేయర్ సమీర్ వర్మ టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. రెండో రౌండ్లో దక్షిణకొరియా ప్లేయర్ కిమ్ డోంగాన్ చేతిలో పరాజయం చెందాడు.
కొరియా గ్వాంగ్జు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 19-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓడాడు సమీర్. కేవలం 39 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత షట్లర్ సత్తాచాటలేకపోయాడు. తొలి సెట్లో ప్రతిఘటించినప్పటికీ విజయం ప్రత్యర్థినే వరించింది. రెండో సెట్‌ను సులభంగానే సమర్పించుకున్నాడు.
గురువారం ఉదయం జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ పరాజయం చెందాడు. జపాన్ కాంటా సునెయామపై ఓడి ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సౌరభ్ వర్మ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఇదీ చదవండి: పింక్ టెస్టు మాకు సవాలే: విరాట్ కోహ్లీ