'నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా' అని రుద్రమదేవిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నా.. 'పాలిచ్చి పెంచిన ఆడవాళ్లకు.. పాలించడం చేత కాదా' అంటూ రాయలసీమ మాండలికంలో జూనియర్ ఎన్టీఆర్ కంటతడి పెట్టించినా.. 'నన్ను అందరూ సౌండ్ ఇంజినీర్ అంటారండి' అని రంగస్థలంలో రామ్‌చరణ్ గోదారి యాసలో పలికినా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాల్లో ఎప్పుడూ ఒకే రీతిలో మాట్లాడే మన హీరోలు వారి వేషాల్లోనే కాదు యాసలోనూ మార్పు తెచ్చారు. అలా వైవిధ్య మాండలికాలతో ఆకట్టుకున్న మన హీరోలపై ఓ లుక్కేద్దాం.
'రుద్రమదేవి'లో.. అల్లుఅర్జున్
'రుద్రమదేవి' సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ తెలంగాణ యాసలో పలికే డైలాగ్‌లు విపరీతంగా అలరించాయి. 'గమ్మునుండవోయ్.. నీ మొలతాడులో నా తాయత్తు', 'నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా'.. లాంటి సంభాషణలకు ఈలలు వేయని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'అరవింద సమేత'లో ఎన్టీఆర్..
యాసలో జాగ్రత్తలు తీసుకునే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. 'బాద్షా'లో కాసేపు తెలంగాణ మాండలికంలో మాట్లాడిన తారక్.. 'అరవింద సమేత'లో రాయలసీమ యాసలో అదరగొట్టేశాడు. 'కంటపడ్డావా.. కనికరిస్తానేమో.. వెంటబడ్డానా.. నరికేస్తా ఓబా'.. 'కదిరప్పా.. ఈడ మంది లేరా.. కత్తుల్లేవా' అంటూ పవర్ఫుల్ సంభాషణలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో మరోసారి తెలంగాణ యాసలో అలరిస్తాడేమో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గోదారి యాసలో రామ్‌చరణ్
గోదారి యాస నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో ప్రత్యేక స్థానాన్ని పొందిన చిత్రం మాత్రం రంగస్థలం. ఇందులో రామ్‌చరణ్ సంభాషణలు ఆకట్టుకున్నాయి. 'కుమార్‌బాబుకు చిట్టిబాబు అనే తమ్ముడున్నాడు.. వాడిని ముట్టుకోవాలంటే ఈ చిట్టిబాబుగాడి గుండెకాయ దాటెళ్లాలని సెప్పండి' అని అదరగొట్టేశాడు చరణ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వరుణ్ తేజ్.. డబుల్ ధమాకా..
విభిన్న రకాల చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. నటనతో పాటు డైలాగ్ డెలివరీలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా 'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేష్' చిత్రాల్లో అతడు చెప్పిన డైలాగ్‌లకు సినీ ప్రియుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'ఎఫ్ 2'లో హాస్యంతో ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన 'గద్దలకొండ గణేష్' చిత్రంలో పవర్‌ఫుల్‌గా కనిపించి అదరగొట్టేశాడు. రెండు సినిమాల్లోనూ తెలంగాణ మాండలికంలోనే మాట్లాడిన వరుణ్.. నటనలో మాత్రం ఎంతో వైవిధ్యం ప్రదర్శించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రామ్.. ఇస్మార్ట్ శంకర్
చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో రామ్. ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లకే ప్రాధాన్యమిచ్చాడు. తొలిసారిగా 'ఇస్మార్ట్ శంకర్'లో పక్కా మాస్ పాత్రను ఎంచుకున్నాడు. క్యారెక్టర్‌కు తగినట్లుగానే సిక్స్ ప్యాక్‌తో అలరించాడు. అంతేకాకుండా పాతబస్తీ యాసలో మాట్లాడుతూ డ్యాన్స్, ఫైట్లతో ఓ ఊపు ఊపేశాడు. రూ. 80 కోట్లకు పైగా వసూళ్లతో రామ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'ఇస్మార్ట్ శంకర్' నిలిచింది. 'ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. కాలిపీలి లొల్లొద్దు' లాంటి డైలాగ్‌లతో హైదరాబాదీ యాసలో అదరగొట్టేశాడు రామ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాని.. 'కృష్ణార్జున యుద్ధం'
'కృష్ణార్జున యుద్ధం' చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. కృష్ణ అనే పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. పక్కా మాస్ క్యారెక్టర్లో అలరించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">