ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు యువ నటుడు శాండీ(సందీప్ మాధవ్). అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఈ నేపథ్యంలో సినిమా చేస్తే బాగుండేదనిపించేదని, 'జార్జ్‌రెడ్డి'తో ఆ అవకాశం రావడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం విలేకర్లతో మాట్లాడాడు.
- "దర్శకుడు జీవన్‌రెడ్డి నేను రూమ్మేట్స్. కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకునేవాళ్లం. అయితే 'వంగవీటి' తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. అందులో కొన్ని బయోపిక్‌లూ ఉన్నాయి. వాటిలో ఏదీ నన్ను ఆకట్టుకోలేదు. అదే సమయంలో జీవన్.. 'జార్జ్‌రెడ్డి' కథ చెప్పాడు. వినగానే ఇలాంటి కథ కదా నేను చేయాల్సిందని అనిపించింది. వెంటనే రంగంలోకి దిగా. 'జార్జ్‌రెడ్డి' గురించి వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. దర్శకుడూ చాలా విషయాలు చెప్పాడు. ఆ పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవడం మొదలుపెట్టా" -సందీప్ మాధవ్, జార్జ్‌రెడ్డి పాత్రధారి
- "22 నుంచి 25 ఏళ్ల వయసులో జరిగే కథ ఇది. 'జార్జ్‌రెడ్డి'లా కనిపించేందుకు కొంచెం సన్నబడ్డా. చిన్నపిల్లాడిలా కొన్ని సన్నివేశాల్లోనూ, పరిణతితో కనిపించే విద్యార్థిలా కొన్ని సన్నివేశాల్లోనూ కనిపిస్తా. ఉస్మానియాలో విద్యార్థి సంఘం స్థాపకుడైన జార్జ్‌రెడ్డి ఎంత మంచి విద్యార్థో, అంత ధైర్యవంతుడు కూడా. స్వతహాగా ఆయనొక బాక్సర్. ఈ కారణంతోనే నేనూ, ఆరు నెలలపాటు బాక్సింగ్‌లో మెళకువలు నేర్చుకున్నా" -సందీప్ మాధవ్, జార్జ్‌రెడ్డి పాత్రధారి
- "జార్జ్‌రెడ్డి రూపం.. బీబీసీలో వచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్, కొన్ని ఫొటోల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫొటోల్లో ఆయన ఎలా నిలబడ్డాడో అలా నిలబడేందుకు, వీడియోను బట్టి ఆయనలా మాట్లాడేందుకు ప్రయత్నం చేశా. జార్జ్‌రెడ్డి తర్వాత తరానికి సంబంధించినవాళ్లనూ 'జార్జ్‌రెడ్డి' గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఈ చిత్రం కోసం 1968 నాటి వాతావరణం సృష్టించాం. ఉస్మానియా సెట్ వేశాం. ఉస్మానియాలో తీసినట్టే ఉందని చాలామంది మెచ్చుకుంటున్నారు" -సందీప్ మాధవ్, జార్జ్‌రెడ్డి పాత్రధారి
- "నిజ జీవిత పాత్రల్ని పోషించడం ఒక భిన్నమైన అనుభవం. 'వంగవీటి' తర్వాత వంగవీటి రంగా, రాధాను అభిమానించిన వారంతా ఆ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. వాళ్ల అభిమానులు నాకూ అభిమానులయ్యారు. 'జార్జ్‌రెడ్డి' పాత్ర చేస్తున్నానని తెలిసిన తర్వాత, మంచి పాత్ర చేస్తున్నావని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి జార్జ్‌రెడ్డి. ఇస్రో నుంచి ఉద్యోగం కోసం పిలుపొచ్చినా వెళ్లకుండా ఇంకేదో చేయాలని తపించారు. అందుకే పవన్‌కల్యాణ్.. 'జార్జ్‌రెడ్డి' జీవితం గురించి సినిమా చేయాలనకున్నారట" -సందీప్ మాధవ్, జార్జ్‌రెడ్డి పాత్రధారి
- "వరుసగా నిజజీవిత పాత్రలే చేస్తున్నాను. ఆ ముద్ర నాపై పడకూడదు కాబట్టి తదుపరి సినిమా వేరుగా ఉండేలా చేయాలనుకుంటున్నా. పరిశ్రమలో నాకంటూ ఎవరూ లేకపోయినా, రావల్సిన అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి అవకాశాలు వస్తుంటాయి. 'జ్యోతిలక్ష్మి'లో నేను కామెడీ పాత్రలో కనిపిస్తా. తదుపరి అలా టైమింగ్‌తో కూడిన కామెడీ పాత్ర చేయాలనకుంటున్నా" -సందీప్ మాధవ్, జార్జ్‌రెడ్డి పాత్రధారి