"శ్రీముఖి.. బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోయినా కోట్ల మంది మనసులు గెలుచుకుంది.." ఇది మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట. ప్రస్తుతం శ్రీముఖికి ఉన్న మద్దతు చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది. బిగ్‌బాస్ రన్నర్‌గా నిలిచిన ఈ యాంకర్ మనుసులోని పలు విషయాలు మీకోసం.
టైటిల్ గెలవలేకపోవడం ఎలా అనిపిస్తోంది..?
గెలుపోటములు సహజం. కాకపోతే ఓడిపోవడం ఎవరికీ ఇష్టముండదు. నాకూ అంతే. ఫైనల్‌కి చేరుకోవడం అంత సులువైన విషయం కాదు. బిగ్‌బాస్ ఇంట్లో ది బెస్ట్ పర్ఫార్మర్గా అందరి మనసుల్ని గెలుచుకోగలిగానని బయటకు వచ్చాక అర్థమైంది. శక్తివంతమైన మహిళగా చివరిదాగా పోరాడాలనుకున్నా. ఈ విషయంలో బాబా భాస్కర్ మాస్టారే నాకు స్ఫూర్తి. "గెలిస్తే అక్కడితో సరిపెట్టుకుంటాం. ఓటమి లక్ష్యంపై కసిగా దృష్టిపెట్టే శక్తినిస్తుంది" అని చెప్పేవారు. చిరంజీవి సర్ "నువ్వు టైటిల్ గెలవకపోయినా.. కోట్లాది మంది మనసులు గెలుచుకున్నావు" అని చెప్పడం ఆనందంగా అనిపించింది.
ఈ ప్రయాణం తర్వాత శ్రీముఖి ఎలా ఉండబోతుంది..?
విశ్రాంతి కోసం మాల్దీవులకు వెళ్తున్నా. కొన్ని రోజులు కుటుంబంతో గడుపుతా. తర్వాత ఎప్పటిలాగే షోలు కొనసాగిస్తా. ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలను అందుకునే పెద్ద బాధ్యత నాపై ఉంది. దాన్ని నిర్వర్తిస్తా. బిగ్‌బాస్ జీవిత పాఠాలెన్నో నేర్పింది. ఆ ఇంటి గుర్తుగా టాటూ నాతో పాటు చివరివరకూ ఉంటుంది. నా వ్యక్తిత్వాన్ని మరింతగా మెరుగుపర్చుకోవడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది.
బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఏమైనా కోల్పోయా అనుకుంటున్నారా..?
మొదట్లో రోజులు ఎంత త్వరగా గడిచిపోతాయా అనిపించేది. చివరికి వచ్చేసరికి.. బిగ్ బాస్ మాటల్ని, ఆ వంటగదిని, బాబా మాస్టార్ని.. ఇలా చాలానే మిస్సవుతానని అనిపించేది. క్రమంగా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే తెలియని బాధ మొదలయ్యింది.
ఇప్పుడేమనిపిస్తోంది..?
గెలుపోటములతో సంబంధం లేకుండా నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. ఒకప్పుడు నాది చిన్న కుటుంబం. ఇప్పుడు నాకో పెద్ద అభిమాన కుటుంబమే ఉంది.
బిగ్‌బాస్ హౌజ్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
బాబా భాస్కర్. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి. శ్రీముఖికి ఆయన మేల్ వర్షన్. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి. ఇద్దరం ఆహార ప్రియులం. వంట చేయడం, డ్యాన్స్.. మా ఇద్దరికీ ఇష్టమే. మా జోడీనీ ప్రేక్షకులూ ఇష్టపడ్డారని బయటకు వచ్చాకే తెలిసింది.
రాహుల్‌తో గొడవ గురించి..?
నాకు రాహుల్‌తో ఇంతకుముందే పరిచయం ఉంది. ఆ ఇంట్లో మా మధ్య జరిగిన కొన్ని విషయాలకు నొచ్చుకున్నా.. వాదనలకు దిగకుండా పరిణతితో వ్యవహరించాలనుకున్నా. టాస్క్‌లు, సందర్భాలు.. సమస్యలకి ఆజ్యం పోయడం మామూలే. రాహులే కాదు మిగిలిన పదిహేను మంది ఇప్పడు ఎక్కడ కనిపించినా సరే.. ఆ ఇంట్లో ఎలా ఉన్నానో.. అలాగే మాట్లాడతా.
కొడుకు గెలిచినా.. మీరంటే ఇష్టమన్న రాహుల్ తల్లి మాటల్ని ఎలా స్వీకరిస్తారు?
థ్యాంక్స్ ఆంటీ. ఒక్కొక్కరికీ ఒక్కో అంశం నచ్చుతుంది. నేను చేసే అల్లరి ఆవిడకి ఇష్ట అని హౌజ్‌లోకి వచ్చినప్పుడే చెప్పారు.
మీరు కాకపోతే ఎవరు గెలవాలనుకున్నారు..?
నేను లేదంటే బాబా భాస్కర్ గెలవాలనుకున్నా. భవిష్యత్తు సీజన్లలో అయినా అమ్మాయిలు గెలిస్తే చూడాలనుకుంటున్నా.
యాంకరింగ్‌కు ఎలా వచ్చారు.?
ఓసారి ఈటీవీలో ప్రసారమయ్యే హోం మినిస్టర్ కార్యక్రమం షూటింగ్ మా ఇంట్లో జరిగింది. ఆ ప్రోగ్రాం డైరెక్టర్ నన్ను చూసి నాన్నతో "మీ అమ్మాయితో యాంకరింగ్ చేయిస్తారా" అని అడిగారు. నాన్న మొదట ఒప్పుకోలేదు. వాళ్లు మళ్లీ అడగడం వల్ల ఒకే ఒక్క షో చేస్తా అంటూ ఆయన్ని ఒప్పించాం. అలా అదుర్స్ కార్యక్రమంతో నా ప్రయాణం మొదలైంది.
తెలుగు గలగలా ఎలా మాట్లాడుతున్నారు..?
చిన్నప్పటి నుంచి టీవీ, సినిమాలు చూడటం తక్కువే. స్థానిక తెలుగు యాస మాట్లాడేదాన్ని. యాంకరింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు నాన్న.. తెలుగు భాషపై పట్టురావాలంటే పత్రికలు చదవాలని చెప్పారు. రోజూ ఉదయాన్నే నాతో ఈనాడు పేపర్ చదివించేవారు.
ఇవీ చూడండి.. కమల్.. విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్