ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని.. నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే లతా వ్యక్తిగత ప్రతినిధి బృందం మాత్రం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించింది.
"లతా ఆరోగ్యం బాగానే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆమె బలంగా పోరాడారు. ఒక గాయనిగా ఆమె ఊపిరితిత్తులకు ఉన్న సామర్థ్యమే ఆమెను గట్టెక్కించింది. నిజంగా గొప్ప యోధురాలు. ఆసుపత్రి నుంచి లతాజీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో మేం తెలియజేస్తాం" -లతా మంగేష్కర్ పీఆర్ టీమ్
శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న మంగేష్కర్ను కుటుంబ సభ్యులు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు ఆమె తొందరగా కోలుకోవాలని నటి, మథుర ఎంపీ హేమా మాలిని ఆకాంక్షించారు.
పలు భారతీయ భాషల్లో లతా మంగేష్కర్ వేల సంఖ్యలో పాటలు పాడారు. 2001లో కేంద్ర ప్రభుత్వం ఆమెను భారతరత్నతో సత్కరించింది. ఈ ఏడాది మార్చి 30న విడుదలైన "సౌగంధ్ ముజే ఇస్ మిట్టీ కీ" పాట ఆమె పాడిన వాటిలో చివరిది.
ఇది చదవండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు అస్వస్థత