'మా' మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నూతన సంవత్సర 'మా' డైరీ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి చిరంజీవి, మోహన్ బాబు, సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధతో పాటు.. 'మా' బాధ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిని చిరంజీవి ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి మనందరం కలిసి 'మా' అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. హీరో రాజశేఖర్ వేదిక పైకి వచ్చి ఆయన చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. 'మా'లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
"మార్చిలో 'మా' కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా బాగా తిట్టారు. 'మా' కోసం ఎందుకు అంతలా పనిచేస్తున్నావ్ అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. కానీ, ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుంది. ‘మా’లో గొడవలున్నాయి. రియల్ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారు."
-రాజశేఖర్, మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు
రాజశేఖర్ వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా తప్పుబట్టారు. బహిరంగంగా ఇలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఇదంతా కావాలని ప్లాన్ చేసిన కుట్రగా చెప్పారు. ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
"నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. ఎందుకు సభను రసాభాస చేయడం. రాజశేఖర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంతో సజావుగా సాగుతున్న సభలో ఒక గౌరవం లేకుండా ఇలా మైక్ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. మీరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు. దయచేసి దీనిని వదిలేయండి. ఎవరూ కోపావేశాలకు వెళ్లొద్దు. ఇలాంటప్పుడు ఇష్టం లేకపోతే రాకూడదు. ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోండి."
-చిరంజీవీ, సినీ నటుడు
అనంతరం మాట్లాడిన జీవితా.. రాజశేఖర్ మాట్లాడిన తీరుకు నేను క్షమాపణ చెబుతున్నా: జీవిత 'మా'లో ఉన్న సమస్యలని కలసి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
'మా'లో సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుందాం. రాజశేఖర్ మాట్లాడిన తీరుకు నేను క్షమాపణ చెబుతున్నా. లోపాలు ఉంటే 'మా'లో మాట్లాడుకుందాం.. బయటకు తీసుకురాకూడదు. అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకునేందుకే నేను,రాజశేఖర్ కృషి చేస్తున్నాం.
-జీవితా రాజశేఖర్, మా సెక్రటరీ
ఇవీ చూడండి.. చిరు-కొరటాల సినిమా షూటింగ్ ప్రారంభం..!