ప్రముఖుల జీవితగాథ తెరకెక్కుతుందంటే సినీ అభిమానుల్లో ఎన్నో సందేహాలుంటాయి. జరిగింది జరిగినట్లు చూపిస్తారా? మార్పులు ఏమైనా చేస్తారా? ఆయా పాత్రల్ని పోషించగల నటులెవరు? ఇలా అనేక అనుమానాలు ఉండటం సహజం. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కథతో తెరకెక్కుతోన్న 'తలైవి' చిత్రం విషయంలోనూ ఇదే ఆసక్తి నెలకొంది.
దర్శకుడు ఎ.ఎల్ విజయ్ రూపొందిస్తున్న చిత్రమిది. కంగనా రనౌత్ జయ పాత్రలో కనిపించనుంది. అయితే అమ్మ సినీ రంగంతోపాటు రాజకీయ రంగంలోనూ రాణించారు. ఈ కారణంగా ఆమె జీవితంలో కీలకపాత్ర పోషించిన అందర్ని వెండితెరపై చూపించాల్సి ఉంటుంది. వీరిలో రాజకీయ రంగానికి సంబంధించి ఎంజీఆర్, కరుణానిధిల పాత్రలు కీలకమైనవి. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ దర్శనమివ్వబోతున్నారు.
సినీ రంగానికి సంబంధించి ఎవరెవరు ఉంటారు? అనే ప్రశ్న సినిమా ప్రకటించినప్పటి నుంచే ఉత్పన్నమైంది. జయ కథలో అలనాటి నటుడు శోభన్ బాబు పాత్ర ఉంటుందా, లేదా? అనే వార్తలకు సమాధానం దొరకక ముందే ఇప్పుడు నందమూరి తారక రామారావు పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్, జయ పలు చిత్రాల్లో నటించారు. వీటికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఈ బయోపిక్‌లో చూపించేందుకు ప్రయత్నిస్తుందట చిత్రబృందం. అంతేకాదు ఎన్టీఆర్ పాత్ర పోషించేందుకు బాలకృష్ణ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఈ మేరకు దర్శకనిర్మాతలు బాలయ్యను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
ఇవీ చూడండి.. 'ఆర్ఆర్ఆర్' అభిమానుల కోసం చెర్రీ అప్డేట్