బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని మరో నటుడు అర్జున్ కపూర్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం 'పానిపట్'. అశుతోష్ గొవరికర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1761లో జరిగిన మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఆ యుద్ధంలో తలపడిన మరాఠా యోధుడు సదాశివరావ్ భవ్‌గా అర్జున్ కపూర్ కనిపించనున్నాడు. అతడి భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అర్జున్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించాడు.
"అశుతోష్ సర్, సంజయ్ లీలా భన్సాలీ సర్ ఇద్దరూ చారిత్రాక నేపథ్యంలో సాగే పలు చిత్రాలను విభిన్న రీతుల్లో ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని నేను గౌరవిస్తున్నాను. 'బాజీరావ్ మస్తానీ'లో రణవీర్ నటనను నేను ఎంతగానో ఇష్టపడ్డాను. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఇప్పటివరకూ చారిత్రక పాత్రలో మెళకువలు తెలుసుకునేందుకు నేను రణవీర్‌ను సంప్రదించలేదు. ఎందుకంటే బాజీరావ్, సదాశివరావ్ ఇద్దరు కూడా వేరు వేరు కాలాలకు చెందినవారు. నాకు మరాఠాల గురించి ఎక్కువగా తెలియదు. కానీ ఈ సినిమా వల్ల కొంత వరకూ నేను చరిత్ర తెలుసుకోగలిగాను."
-అర్జున్ కపూర్, బాలీవుడ్ నటుడు
రణవీర్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి అర్జున్ కపూర్ మాట్లాడారు. "మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇప్పటికీ రణవీర్ నేను నటించిన సినిమాల్లోని పాటలు చూసినప్పుడు వాయిస్ మెసేజ్‌లు, కిస్ ఎమోజీలు నాకు పంపిస్తుంటాడు. నేను తనకి సవతినని దీపికకు చెప్తుంటాను" అని అర్జున్ తెలిపాడు.
ఇవీ చూడండి.. భన్సాలీ చిత్రంలో 'తాప్సీ' ద్విపాత్రాభినయం..!