కొత్తదనమే కాదు.. కొత్త తరాన్ని ఆహ్వానించడంలోనూ ముందుంటుంది తెలుగు చిత్రసీమ. కాస్త ప్రతిభ ఉందని తెలిస్తే చాలు.. అవకాశాలతో వాళ్లకి పట్టం కడుతుంది. అలా రాత్రికి రాత్రే స్టార్లుగా అవతరించిన వాళ్లు ఎంతోమంది. ఇక కథానాయికలకైతే మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి. తెలుగులో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య బాగా ఎక్కువ. ఏటా 150కి పైగా సినిమాలు పట్టాలెక్కుతుంటాయి. ప్రతి సినిమాకీ హీరోయిన్ కావాల్సిందే. మన దగ్గరేమో నాయికల కొరత. దాంతో ఏటా పదుల సంఖ్యలో కొత్త తారలు తెలుగు తెరపై మెరుస్తుంటారు. సరికొత్తగా మురిపిస్తుంటారు. ఈసారి కూడా ఆ సంఖ్య ఎక్కువే. అగ్ర హీరోల చిత్రాల కోసం పొరుగు భాషల నుంచి కూడా వచ్చారు.
భాషల పరంగా హద్దులు చెరిగి పోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా సాగుతోంది. అందుకే భాషతో సంబంధం లేకుండా కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ తారలు ఒకప్పుడు ప్రాంతీయ భాషల్లో నటించేందుకు అంతగా ఆసక్తి చూపేవాళ్లు కాదు. హిందీలో కాకుండా, వేరే భాషలో నటిస్తే తమ స్థాయి తగ్గినట్టుగా భావిస్తారేమో అని భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంచి కథ, తగిన పారితోషికం లభిస్తే చాలు... పచ్చజెండా ఊపేస్తున్నారు. అలా ఈ ఏడాది బాలీవుడ్ నాయికలు విద్యాబాలన్, శ్రద్ధాకపూర్ తెలుగు తెరపైన తొలిసారి మెరిశారు. ఆలియాభట్ 'ఆర్.ఆర్.ఆర్' కోసం సంతకం చేసింది. ఇక కియారా అడ్వాణీ అయితే గతేడాదే తెలుగులో అడుగుపెట్టింది. ఈసారి 'వినయ విధేయ రామ'లో నటించి ఆకట్టుకుంది. అగ్ర కథానాయకులకి జోడీగా ఓ కొత్త తార కావాలి అనిపించిన ప్రతిసారీ తెలుగు దర్శకనిర్మాతలు బాలీవుడ్వైపే చూస్తుంటారు. దాంతో ఎప్పుడు ఎవరైనా మన తెరపై మెరవొచ్చన్నమాట.
'ఎన్టీఆర్' చిత్రాల కోసం
విద్యాబాలన్ తెలుగు సినిమా చేయడం గురించి తరచూ ప్రచారం సాగేది. అగ్ర కథా నాయకుల చిత్రాల కోసం ఆమెని తరచూ సంప్రదించే వారు. కానీ అక్కడి సినిమాలతో బిజీగా ఉండటం, కథ నచ్చకపోవడం లాంటి కారణాలతో ఆమె తెలుగులో చేయడం సాధ్యం కాలేదు. ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ కోసం కెమెరా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ అర్ధాంగి బసవరామ తారకం పాత్రలో విద్యా నటించింది. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ చిత్రం తర్వాత విద్యాబాలన్ తెలుగు సినిమాలపై ప్రేమని పెంచుకుంది. తగిన పాత్ర ఎప్పుడొచ్చినా ఇక తెలుగులో చేస్తానని చెప్పిందామె. మరో నాయిక శ్రద్దా కపూర్ 'సాహో'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.
ఆమె ప్రభాస్‌తో కలిసి చేసిన సందడి ఆకట్టుకుంది. గోపీచంద్ 'చాణక్య'తో జరీన్‌ఖాన్ కూడా తెలుగు తెరపై మెరిసింది. 'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్'తో శషా చెట్రి, 'ఆవిరి'తో నేహాచౌహాన్, 'నిను వీడని నీడని నేనే'తో అన్య సింగ్, 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'తో శ్రుతిశర్మ తెలుగులో అవకాశాల్ని అందుకున్నారు. వీళ్లంతా కూడా అంతకు ముందు బాలీవుడ్లో నటించారు.
అక్కడ అలరించి...
హిందీ నుంచే కాదు.. దక్షిణాది భాషల్లో మెరిసి ఆ తర్వాత తెలుగు పరిశ్రమని ఆకర్షించిన నాయికలు చాలా మంది ఈసారి అవకాశాలు అందుకున్నారు. ఆ జాబితాలో శ్రద్ధా శ్రీనాథ్, ఐశ్వర్యారాజేష్, దివ్యాంశ కౌశిక్, ప్రియాంక మోహన్ తదితరులున్నారు. తమిళ, కన్నడ భాషల్లో 2015 నుంచి సినిమాలు చేస్తోంది శ్రద్ధాశ్రీనాథ్. ఆమె తమిళంలో చేసిన 'విక్రమ్ వేద'ని చూసి తెలుగు చిత్రం 'జెర్సీ' కోసం ఎంపిక చేసుకున్నారు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో నానికి భార్యగా, ఒక అబ్బాయికి తల్లిగా శ్రద్ధ మంచి అభినయం ప్రదర్శించింది. ఆ తర్వాత 'జోడి'లోనూ మెరిసింది. కథానాయకుడు రానా నిర్మాణంలో, రవికాంత్ పేరేపు తెరకెక్కించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల'లోనూ ఆమె నటించింది. త్వరలోనే ఆ చిత్రం విడుదల కానుంది. తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ తెలుగులో తొలి అవకాశం ఈ ఏడాదే అందుకుంది. 'కౌసల్య కృష్ణమూర్తి'లో ఆమె నటించింది.
భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆ చిత్రంలో క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్ చక్కటి అభినయం ప్రదర్శించింది. ఇటీవల 'మిస్ మ్యాచ్'లోనూ మెరిసింది. నాని సినిమా నుంచే మరో భామ పరిచయమైంది. ఆమె ఎవరో కాదు.. ప్రియాంక మోహన్. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న ప్రియాంక మోహన్... నాని 'గ్యాంగ్‌లీడర్'తో తెలుగు తెరకు పరిచయమైంది. సహజమైన నటనతో ఆమె మెప్పించింది. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.