ఇంటర్మీడియెట్ విద్యార్థులెవరైనా తమ చదువులూ, పోటీ పరీక్షల ప్రణాళికల్లోనే పూర్తిగా తలమునకలవుతారు. కానీ చెన్నైకు చెందిన గుణీషా అగర్వాల్ మాత్రం.. తను చదువుకుంటూనే మరెందరో చదువుకునేలా చేస్తోంది. ఆన్‌లైన్ చదువుల్ని పేద విద్యార్థులకు చేరువ చేసేందుకు డిజిటల్ పరికరాల్ని విరాళమివ్వాలంటూ పిలుపునిచ్చింది. దానికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌నీ ప్రారంభించిందీమె.
కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో చాలావరకు విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. వీటికి హాజరు కావడానికి గుణీషాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. కానీ వాళ్లింట్లో పనిచేసే వ్యక్తి కుమార్తెకు మాత్రం డిజిటల్ తరగతులు వినేందుకు ఎలాంటి సాధనమూ లేకపోవడంతో గుణీషా తల్లి పాత ల్యాప్‌ట్యాప్‌ను ఇచ్చింది. దీన్ని గమనించిన గుణీషా తమిళనాడులో పేద విద్యార్థులకు ఎవరైనా తమ దగ్గరున్న పాత, కొత్త.. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లు అందించేలా వెబ్‌సైట్‌ను రూపొందించింది.
దాతలూ.. గ్రహీతల వేదిక
helpchennai.org వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్‌లేని పేద విద్యార్థులకు సాయం చేయాలనుకున్న దాతలు తమ వివరాలను నమోదు చేస్తే.. అవసరాల్లో ఉన్నవారి వివరాలు తెలుస్తాయి. లేదా ఆయా పరికరాలను గుణీషాకు పంపిస్తే ఆమే విద్యార్థులకు అందజేస్తుంది. ఇదంతా తెలుసుకున్న ‘మార్క్ మెట్రో అడ్వర్టైజ్‌మెంట్’ సంస్థ డైరెక్టర్ ఆర్.ఆనందకృష్ణ.. 100 ట్యాబ్స్, రూ.12 లక్షల ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకు 200 మందికి పైగా విద్యార్థులకు సాయం అందించింది గుణీషా.