స్త్రీ తన కుటుంబం పాలిట ఓ దేవత. ఇంటిని చక్కబెట్టుకోవడమే కాదు జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడంలోనూ ఆమె ఔన్నత్యం దాగి ఉంటుంది. జీవుల చావు-పుట్టుకలకు కర్మలు కారణమవుతాయి. దీనికి సత్యవంతుడు సైతం మినహాయింపేమీ కాదు.
పన్నెండేళ్ల సావిత్రికి ఆయన భర్త. ఆమె అత్తమామలు అంధులు. సత్యవంతుడు పూర్వ కర్మవశాన పాముకాటుతో మరణించాడు. యముడు వచ్చి అతడి ప్రాణాలను తీసుకొని వెళ్లిపోతున్నాడు. సావిత్రి కూడా ఆయన వెంటపోసాగింది. పాంచభౌతిక దేహంతో తనను వెంబడించలేవని యముడు హెచ్చరించాడు. తన భర్తలేనిదే తాను లేనంది. పతి ప్రాణాలు ఇస్తే ఆయన సేవ చేసుకుంటూ ముక్తి పొందుతానని ప్రాధేయపడింది. స్వకులోద్ధరణ పతివ్రత ధర్మం కాబట్టి తన కోరికను మన్నించాలంది. వీలు కాదన్నాడు యముడు. అందుకు ప్రతిగా మూడు వరాలిస్తానన్నాడు.
అంత క్లిష్ట సమయంలోనూ ఆమె తన సంయమనాన్ని కోల్పోలేదు. దుఃఖాన్ని దిగమింగుతూనే తెలివిగా ఆలోచించింది. తనకు పుత్ర ప్రాప్తి కావాలని కోరుతూ యముడిని ఇరుకున పెట్టింది. తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది.