అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. తమ దేశ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీ మరణం అనంతరం ప్రతీకారేచ్చతో రగలిపోతున్న ఇరాన్.. తాజాగా ఇరాక్‌లోని అమెరికా భద్రతా దళాలకు చెందిన రెండు సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. డజనుకుపైగా బాలిస్టిక్ క్షిపణులతో అల్ అసద్, ఇర్బిల్ స్థావరాలపై దాడి జరిగినట్టు అమెరికా రక్షణశాఖ పెంటగాన్ ధ్రువీకరించింది.
ఇరాన్ క్షిపణి దాడుల్లో కనీసం 80 మంది మరణించినట్లు తెలుస్తోంది. 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' మరణించారని ఇరాన్ అధికారిక టీవీ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తం 15 క్షిపణులతో దాడి చేశామని, అన్ని మిసైల్స్ లక్ష్యాన్ని చేరుకున్నాయని ఇరాన్ మీడియా పేర్కొంది.
ఆత్మ రక్షణ కోసమే...
ఈ ఘటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జారిఫ్.. ఆత్మ రక్షణ చర్యల్లో భాగంగా క్షిపణులతో దాడి చేసినట్టు తెలిపారు. తాము యుద్ధం కోరుకోవట్లేదని.. కానీ ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
శ్వేత సౌధం అలర్ట్..
ఇరాన్ ప్రతిఘటన అనంతరం శ్వేత సౌధంలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తాజా పరిస్థితులు వివరించారు అధికారులు.
"అంతా బాగానే ఉంది. ఇరాక్‌లోని రెండు మిలిటరీ స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అంతా బాగుంది. ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సైన్యం అమెరికా సొంతం. దీనిపై త్వరలోనే ఓ కీలక ప్రకటన చేస్తాను."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
విమానాలపై ఆంక్షలు...
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇరాక్, ఇరాన్, ఒమన్, సౌదీఅరేబియాలకు జల, విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ దేశాలకు జల మార్గం, గగన తలంలో అన్ని రాకపోకలను నిషేధించినట్లు అమెరికా విమానయాన శాఖ వెల్లడించింది