ఇరాన్లో రెండో శక్తిమంతమైన నేత ఖాసీం సులేమానీని అమెరికా సేనలు మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భయాలు కమ్ముకున్నాయి. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇరాన్ ప్రయత్నించే అవకాశం ఉందని బ్రిటన్, జర్మనీ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఐరాస భద్రతామండలిలో సభ్యదేశాలైన చైనా, రష్యా, ఫ్రాన్స్‌లు అమెరికా దాడులపై ఆచితూచి స్పందించాయి.
అయితే అగ్రరాజ్యం అమెరికా తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇరాక్ సహా పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలు, అధికారులపై దాడులు చేసేందుకు సులేమానీ కుట్రపన్నారని శ్వేతసౌధ వర్గాలు ట్వీట్ చేశాయి.
మార్కెట్లు వెలవెల
సులేమానీ మృతి వార్తతో మదుపరుల్లో నెలకొన్న భయాందోళనలు జాగ్రత్త పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. తక్షణ ప్రతీకార చర్యలకు ఇరాన్ దిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టే అంశమై మదుపరుల్లో ఊగిసలాట ఏర్పడింది.
ఫ్రాన్స్ ప్రకటన
సులేమానీని మట్టుబెట్టడంపై ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
"మనం అత్యంత ప్రమాదకర ప్రపంచంలో ఉన్నాం. సైనిక ఉద్రిక్తతలు అన్ని వేళలా ప్రమాదరకరమే. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి."
-ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ప్రకటన
'ఎన్నికల కోసమే'
పశ్చిమాసియా దేశాల్లోని సమస్యలను ఇలాంటి ఆపరేషన్లు తొలగించలేవని వ్యాఖ్యానించింది రష్యా. ఇలాంటి ఘటనల వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
"అమెరికా సైన్యం వారి రాజకీయ నేతల ఆదేశాల పైన ఆధారపడుతుంది. అయితే అగ్రరాజ్య నేతలకు వారి వ్యక్తిగత ఆసక్తులు ఉంటాయనేది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. ఈ ఏడాది ఎన్నికలు కూడా ఉన్నాయి."
-రష్యా ప్రకటన
అదే సమయంలో ఎన్నికల్లో గెలిచేందుకే సులేమానీని మట్టుబెట్టారని వ్యాఖ్యానించారు అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రాటిక్ నేత జో బిడెన్.
చైనా విదేశాంగ కార్యాలయం ప్రకటన
ఘటనపై నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా ప్రకటించింది. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో శాంతి నెలకొనాలని డ్రాగన్ దేశ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సహా అన్ని పక్షాలు ఉద్రిక్తతలు పెరగకుండా సంయమనం పాటించాలని కోరింది.
అయితే జర్మనీ అగ్రరాజ్యానికి అనుకూలమైన ప్రకటన చేసింది. ఇది సైనిక చర్యలకు ప్రతీకారంగా జరిగిన ఘటన అని దీనికి పూర్తి బాధ్యత ఇరానే భరించాలని వ్యాఖ్యానించింది. కుర్దు సైన్యం నేత అయిన సులేమానీ దుందుడుకు విధానాలను గమనిస్తూనే ఉన్నామని బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
అయితే సులేమానీ లక్ష్యంగా ఆపరేషన్ అనంతరం పలు దేశాల అధినేతలకు ఫోన్లు చేశారు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో. అమెరికా నిర్ణయానికి అనుకూలంగా ప్రకటన చేయాలని కోరారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకే అగ్రరాజ్యం సంకల్పించిందని వెల్లడించారు.
దుశ్చర్యలను ఆపాల్సిందే
సులేమానీ ఘటనపై స్పందించింది ఐరోపా సమాఖ్య. దుశ్చర్యలకు పాల్పడటాన్ని ఇరాక్ ఆపేయాలని వెల్లడించింది. లేదంటే ఇరాక్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదీ చూడండి: ట్రంప్‌కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?