ప్రపంచ ఆర్థిక సదస్సు-2020కు స్విట్జర్లాండ్‌లోని స్కీ రిసార్ట్ పట్టణం ముస్తాబైంది. సోమవారం నుంచి 5 రోజుల పాటు జరగనున్న 50వ వార్షిక సమావేశాల్లో సమైక్యతతో కూడిన స్థిరమైన ఆర్థిక ప్రపంచాన్ని ఎలా సాధించాలనే అంశంపై చర్చ జరగనుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు చార్లెస్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌తో సహా దాదాపు 3వేల మందికిపైగా నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
దీపికా, సద్గురు...
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల సీఈఓలకు సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందగా.. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. ఇంకా భారత్ నుంచి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సదస్సుకు హాజరుకానున్నారు. బాలీవుడ్ నటి దీపిక పదుకొణె, ఆధ్యాత్మిక గురువు సద్గురు.. సమావేశాల్లో పాల్గొని మానసిక ఆరోగ్యం, మెడిటేషన్‌పై మాట్లాడనున్నారు.
ఈసారి జరగనున్నది 50వ వార్షిక సదస్సు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లకు పరిష్కార మార్గాలు, వాటాదారుల పెట్టుబడిదారీ వ్యవస్థను స్థాపించడమే లక్ష్యంగా తొలి ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాలు జరిగాయి.
"వాటాదారుల పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా స్వీకరించాలి. అయితే వారు లాభాలను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి సారించకూడదు. ఈ దశాబ్దంలోని ముఖ్య సమస్యలను ప్రభుత్వాలు, పౌర సమాజ సహకారంతో పరిష్కారంలో భాగం కావాలి. పెట్టుబడిదారులు కూడా సమైక్య, స్థిరమైన ప్రపంచానికి సహకరించాలి."
-క్లాస్ ష్వాబ్, డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు.
మేనిఫెస్టోలో ఆరు అంశాలు..
2020 సదస్సు మేనిఫెస్టోలో ప్రధానంగా ఎకాలజీ, ఎకానమీ, సొసైటీ, ఇండస్ట్రీ, టెక్నాలజీ, జియోపాలిటిక్స్ అనే ఆరు అంశాలను నిర్వాహకులు పొందుపర్చారు. ఈ దశాబ్దంలో ఒక ట్రిలియన్ చెట్లను నాటడం, నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఒక బిలియన్ మంది ప్రజలను వారి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే ఈ సారి లక్ష్యంగా పెట్టుకున్నారు.
సదస్సుకు యువ రక్తం...
ప్రపంచవ్యాప్తంగా 120మంది యువ ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. అందులో 20ఏళ్ల లోపు వారు 10మంది ఉన్నారు. అయితే సదస్సులో ఈసారి కొత్తగా ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
సదస్సులో భారత పారిశ్రామిక దిగ్గజాలు..
గౌతమ్ అదానీ, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, కుమార మంగళం బిర్లా, ఎన్. చంద్రశేఖరన్(టాటా గ్రూప్), ఉదయ్ కోటక్, రజ్నీష్ కుమార్(ఎస్బీఐ), ఆనంద్ మహీంద్ర, సునీల్ మిట్టల్, రాజన్ మిట్టల్, ఫిరోజ్ షా(గోద్రెజ్) తదితర దిగ్గజాలు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు.