కాటలాన్ వేర్పాటువాద నేతలకు స్పానిష్ కోర్టు శిక్ష విధించడంతో స్పెయిన్లో జరుగుతున్న అల్లర్లు హింసాత్మకంగా మారుతున్నాయి. కాటలోనియా ప్రాంతంలో నిరసన జ్వాలలు అలుముకున్నాయి. బార్సిలోనా క్యాంప్ సమీపంలో.. రియల్ మాడ్రిడ్, బార్సిలోనా మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 5 వేల మంది నిరసనకారులు.. ముసుగులు ధరించి ఆందోళనలు చేశారు.
బారికేడ్లు, ఇతర వాటికి నిప్పంటించి.... పోలీసులపై రాళ్లు, బాటిళ్లను విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఫోమ్ బులెట్లను ప్రయోగించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో 46 మంది గాయపడగా... 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ కారణం...
దేశద్రోహానికి పాల్పడ్డారన్న నేరంపై 12 మంది కాటలాన్ వేర్పాటువాద నేతలకు స్పానిష్ న్యాయస్థానం శిక్ష విధించడం వల్ల ఈ ఆందోళనలు ప్రారంభమయ్యయి. రెండేళ్ల పాటు జుడీషియల్ కస్టడీలో ఉన్న వారికి న్యాయస్థానం శిక్ష విధించడం.. కాటలోనియాలో చాలామంది ఆగ్రహానికి కారణమైంది. వేర్పాటువాదులను విడుదల చేయాలని నిరసనలు ఉద్ధృతం చేశారు.
ఇదీ చూడండి : వ్యక్తిగత కక్షతోనే మరణ శిక్ష: ముషారఫ్