పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్.. ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన మరిన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలోని అఫ్గానిస్థాన్‌తో పాటు, పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో అమెరికాకు ఎక్కడెక్కడ సైనిక స్థావరాలున్నాయి? ఎంతమేర బలగాలున్నాయంటే..
జోర్డాన్ 3000
ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలు, సౌదీ అరేబియాకు సరిహద్దులో ఉన్న జోర్డాన్‌లో అమెరికా సైనికులున్నారు. ఐఎస్‌పై పోరు కోసం ఇక్కడి మువాఫక్ సాల్టీ వైమానిక స్థావరం వద్ద ఏర్పాటు చేసిన శిబిరం కీలకమైంది.
టర్కీ 2500
టర్కీలో అమెరికా సైనికులు ఇన్‌క్రెలిక్ వైమానిక స్థావరంతో పాటు, నాటో దళాలున్న ప్రాంతాల్లో మోహరించారు.
సిరియా 3000
సిరియా-జోర్డాన్ సరిహద్దులోని టాన్ఫ్ వద్ద ఉన్న అమెరికా శిబిరం కీలకమైనది. ఇరాన్‌కు చెందిన, ఆ దేశానికి మద్దతిస్తున్న బలగాలు ఇక్కడికి సమీపంలోనే మోహరించి ఉన్నాయి.
సౌదీ అరేబియా 3000
ఇరాన్-సౌదీ అరేబియాల మధ్య ప్రాంతీయ వైరం ఉంది. సౌదీలోని చమురు, సహజ వాయు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేస్తోందంటూ అమెరికా ఆరోపించగా, ఇరాన్ ఖండించింది.
ఇరాక్ 6000
బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్, ప్రహరీ మధ్య ఉన్న దౌత్య ప్రాంతం, అల్-అసద్ వైమానిక స్థావరం సహా పలుచోట్ల అమెరికా దళాలున్నాయి.
అఫ్గానిస్థాన్ 14000
అమెరికా-ఇరాన్ తరహా వివాదమే దక్షిణాసియాలోని అఫ్గనిస్థాన్‌లో కూడా తలెత్తే అవకాశం ఉందని బ్రసెల్స్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ (ఐసీజీ) హెచ్చరించింది.
కువైట్ 13000
1991 పర్షియన్ గల్ఫ్ యుద్ధం నాటి నుంచి అమెరికా, కువైట్‌ల మధ్య రక్షణ సహకార ఒప్పందం ఉంది.
బహ్రెయిన్ 7000
అమెరికా నౌకా స్థావరాలకు ఆతిథ్యమిస్తోంది. సౌదీకి సన్నిహితంగా ఉండే బహ్రెయిన్, ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి మద్దతిస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5000
సౌదీ అరేబియా, అమెరికాలతో వాణిజ్య సంబంధాలను యూఏఈ మెరుగు పరుచుకుంటోంది. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇరకాటంలో పెడుతుండటంతో కొంత సామరస్య ధోరణితో ఉంది.
ఒమన్ 606
ఒమన్‌లోని విమాన, నౌకాశ్రయాలను అమెరికా వినియోగించుకోవడానికి ఆ దేశం ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
ఖతార్ 13000
పశ్చిమాసియాలో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఉన్నది ఖతార్‌లోనే. ఇక్కడి స్థావరాన్ని మరింత పెంచేందుకు 2018లో ఖతార్ 180 కోట్ల డాలర్లతో ప్రణాళికను రూపొందించింది. తన ప్రత్యర్థులైన సౌదీ అరేబియా, యూఏఈల ఘర్షణ వైఖరి నేపథ్యంలో ఖతార్ ఈ నిర్ణయం తీసుకుంది.