ఉదయం వార్తాపత్రికలు చదవడం, సాయంత్రం టీవీని చూడటం మానేశానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ ఆర్థిక వేదికలో వెల్లడించారు. తనను, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మీడియాలో తీవ్ర ప్రతికూల వార్తలు రాస్తున్నారని ఆరోపించారు. అందుకే వార్తాపత్రికలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు హాజరైన ఖాన్.. పాక్ మానవత్వం కలిగిన దేశమని, సంక్షేమ సమాజం కోసం పాటు పడుతోందని.. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తున్నామన్నారు.
ఫలితం కోసం వేచి చూడాలి...
ప్రస్తుత ప్రభుత్వం పాలనాపరమైన, సంస్థాగతమైన సంస్కరణలు చేస్తుందని.. వాటిని ప్రశ్నించడం బాధేస్తుందన్నారు. సంస్కరణలు చేపట్టినప్పుడు.. ఫలితం రావాలంటే సమయం పడుతుందని, సహనంతో ఉండాలని వారికి సూచించారు.
''ప్రస్తుతం పాక్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొద్ది కాలం ఒడుదొడుకులు తప్పవు. పాక్‌కు మంచి రోజులు వస్తాయి.. నేను హామీ ఇస్తున్నా.''
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ప్రపంచ వ్యాపారవేత్తల ముందు ప్రసంగించారు పాక్ ప్రధాని. ఆ దేశ ఆర్థిక సామర్థ్యం సహా భవిష్యత్తు కార్యక్రమాల కార్యాచరణ గురించి వివరాలు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇమ్రాన్‌తో భేటీలో ట్రంప్ నోట మళ్లీ 'కశ్మీర్' పాట