సౌదీ అరేబియా పర్యటన విజయవంతంగా ముగించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పర్యటనలో భాగంగా సౌదీ రాజు, యువరాజులతో అధికారిక సమావేశాలు నిర్వహించారు. అయితే ఇరువురు దేశాధినేతల మధ్య జరిగిన విస్తృతమైన చర్చలలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాకపోవడం గమనించదగ్గ విషయం. చాలా దేశాల మాదిరిగానే సౌదీ అరేబియా కూడా కశ్మీర్‌ను భారత అంతర్గత అంశంగానే పరిగణిస్తోందని ఈ చర్చలతో స్పష్టమైంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ భారత్‌ను ఇరకాటంలో పడేయడానికి విఫలయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సౌదీ మాత్రం కశ్మీర్ అంశంలో ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. భారత్‌లో రాజకీయ పరిస్థితులను సౌదీ ఉత్తమంగా అర్థం చేసుకొని దౌత్యపరంగా సమున్నతంగా నడుచుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
పరస్పర సహకారం
భారత్-సౌదీ దేశాల అధినేతలు చేసిన చర్చల సారాంశాన్ని ఇరుదేశాలు విడుదల చేశాయి. ప్రాంతీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ విషయాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకారం కల్పించుకునేలా నిర్ణయించుకున్నాయి. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ఇతర దేశాల అంతర్గత విషయాలలో కలగజేసుకోబోమని మరోసారి చాటారు. దీంతోపాటు దేశాల సమగ్రతను దెబ్బతీయడానికి జరిగే దాడులను అడ్డుకునేలా బాధ్యతగా వ్యవహరించుకోవాలని నిర్ణయించారు.
అమ్మకాలు-కొనుగోళ్లకు పరిమితం కాకూడదు
ఎడారిలో ఉండే దావోస్ నగరంగా పేరు గాంచిన రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియేటివ్ ఫోరం మూడో సమావేశంలో మోదీ మాట్లాడారు. భారత్‌కు పెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్నందున సౌదీ అరేబియాతో బంధం కేవలం అమ్మకాలు-కొనుగోళ్ల మధ్యన నలిగిపోకూడదని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముడి చమురు ఎగుమతులే కాకుండా ఇతర రంగాల్లోనూ సౌదీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లానని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్యానించారు.
సౌదీ విజన్-2030
సౌదీలో రాజుదే అత్యున్నత పదవి అయినప్పటికీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాలనాపరమైన అన్ని విషయాలను నియంత్రిస్తున్నారు. దేశానికి రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధాని హోదాలో ఉన్న సల్మాన్ ఇతర దేశాలతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి విజన్ 2030ని రూపొందించారు. ఇందులో భాగంగా ఎనిమిది దేశాలతో అత్యున్నత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే యూకే, ఫ్రాన్స్, చైనాలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు కూడా. నాలుగో వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను ఎంపిక చేసుకుంది సౌదీ.
వ్యూహాత్మక మండలి
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఏడాది ఫిబ్రవరీలో భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యువరాజు సల్మాన్‌తో అత్యున్నత చర్చలు జరిపిన ప్రధాని మోదీ ఇరుదేశాల మధ్య సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రెండు సంవత్సరాలకు ఒకసారి దేశాధినేతల భేటీతో పాటు సంవత్సరానికి ఒకసారి మంత్రుల సమావేశాన్ని నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు యువరాజు సల్మాన్ తొలిసారి వ్యూహాత్మక మండలిని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కార్యరూపం తీసుకువచ్చేలా భారత్ అడుగులు వేసింది.
రెండు ప్రధాన అజెండాలు
వ్యూహాత్మక మండలి ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిసారిస్తుంది. ఓ వైపు రాజకీయం, భద్రతా, సాంస్కృతిక, సామాజిక అంశాలపై వ్యూహాత్మక మండలి ప్రధానంగా చర్చిస్తుంది. ఇందులో భాగంగానే రక్షణ సంబంధిత అంశాలు కూడా చేర్చింది. మరోవైపు ఆర్థిక రంగం, పెట్టుబడులు వంటి అంశాలలో ఇరుదేశాల భాగస్వామ్యం మెరుగుపడేలా మండలి తోడ్పాటునందిస్తుంది. భారత్ నుంచి వాణిజ్యశాఖ మంత్రితో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సౌదీ తరపున ఇంధన శాఖ మంత్రి ఆర్థిక రంగ విషయాలపై సమావేశమవుతారు.
రష్యా, జర్మనీ, జపాన్‌లతో భారతదేశం ఎప్పటినుంచో సంస్థాగతంగా అత్యున్నత స్థాయి సంబంధాలను కలిగి ఉంది. అదేవిధంగా సౌదీతో కూడా సంబంధాలు శిఖరాగ్రానికి చేర్చేలా ఇరుదేశాలు అడుగులేస్తున్నాయి. ఉగ్రవాదం, సైబర్ దాడులు, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు సహకరించుకోవడం, సమాచార మార్పిడి, ఆర్థిక సంబంధాలను విస్తృతపరచడం వంటివి ఈ వ్యూహాత్మక మండలిలో ప్రధాన అజెండాలుగా ఉన్నాయి.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
సౌదీలో మంగళవారం జరిగిన చర్చల్లో ఇరుదేశాధినేతలు ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. సమాజంలో అతివాదం, ఉగ్రవాదం అతిపెద్ద సవాళ్లని అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రవాదాన్ని ఏ ఒక్క మతానికో, జాతికో, సంస్కృతికో ముడిపెట్టి చూడకుడదని గళమెత్తి వినిపించారు. ఇతర దేశాలలో విధ్వంసం సృష్టించే ఉద్ధేశంతో ఉగ్రవాదులకు ఎటువంటి ఆయుధాలు అందకుండా చేయాలని పిలుపునిచ్చారు. సౌదీలో జరిగిన ఉగ్రవాద దాడులను భారతదేశం ఖండిస్తున్నట్లు చర్చల తర్వాత విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేశారు.
సౌదీకి మోదీ కృతజ్ఞత
ఇటీవలే సౌదీలో ప్రభుత్వ అధీనంలో నడిచే అతిపెద్ద చమురు ఉత్పత్తి క్షేత్రంపై డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో భారతదేశానికి ఎలాంటి అవరోధం లేకుండా చమురు ఎగుమతి చేస్తామని సౌదీ వాగ్దానం చేసింది. భారతదేశ చమురు దిగుమతులలో సౌదీ అరేబియా వాటా 18 శాతంగా ఉంది. దేశ ఎల్పీజీ అవసరాల్లో 30 శాతం సౌదీ తీర్చుతోంది. అందువల్ల భారత్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చమురు ఎగుమతి చేయడానికి సౌదీ అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సౌదీ ఇంధన శాఖ మంత్రి భారత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఇందుకుగానూ సౌదీ అధికారులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.