ఉగ్రవాదానికి బీజం వేస్తూ, వేర్పాటువాదానికి కారణమయ్యే అంశాలను భారత్ పెకిలించివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అసాధ్యమనుకునే లక్ష్యాలను సుసాధ్యం చేయడానికి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. బ్యాంకాక్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన 'సావాస్‌దీ మోదీ' కార్యక్రమంలో ప్రసంగించారు ప్రధాని.
ప్రజాస్వామ్యంలో సరికొత్త చరిత్ర
ఇటీవల దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60 కోట్ల మంది ఓట్లేశారని... ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద సంఘటన అని మోదీ పేర్కొన్నారు. భారత్‌తో థాయిలాండ్ రాజ వంశీకుల మధ్య ఉన్న స్నేహాన్ని.. చారిత్రక సంబంధాలకు ప్రతీకగా అభివర్ణించారు. భారత్- థాయిలాండ్‌ల సంబంధాలు.... కేవలం ఒక్క ప్రభుత్వం వల్ల బలపడలేదని...గతంలో ఇరుదేశాలు పంచుకున్న సమయం వల్లే సంబంధాలు బలపడ్డాయని చెప్పారు మోదీ. ఇరుదేశాలు చేరువ కావడానికి భాషే కాకుండా విశ్వాసాలు కూడా కారణమన్నారు. ఆర్టికల్ 370 రద్దు గురించి మోదీ మాట్లాడుతున్న సమయంలో సభలో పాల్గొన్న ప్రజలందరూ లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. అయితే ఈ గొప్పతనం అంతా భారత పార్లమెంట్, పార్లమెంటు సభ్యలదేనని మోదీ స్పష్టం చేశారు.
'దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం పెరగడానికి కారణమయ్యే అంశాలను తొలగించడానికి భారత్ నిశ్చియించుకుందన్న విషయం మీకు తెలుసు. మనం తీసుకున్న నిర్ణయం సరైనదైతే దాని ప్రతిధ్వని ప్రపంచం అంతా వినిపిస్తుంది. అది ఇప్పుడు నాకు థాయిలాండ్‌లో కూడా వినిపిస్తోంది.' -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
కర్తార్‌పూర్ నడవా ప్రారంభం గురించి ప్రస్తావించిన మోదీ.. ఇక నుంచి భక్తులందరూ స్వేచ్ఛగా తమ యాత్రను చేపట్టవచ్చని అన్నారు. గత ఐదేళ్లలో భారత్‌లో చోటు చేసుకున్న మార్పులను గమనించిన ప్రజలు మరోసారి తమ ప్రభుత్వానికి అవకాశమిచ్చారన్నారు. భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే విషయంలో తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పునరుద్ఘాటించారు మోదీ.