పాకిస్థాన్లో టమాటాల ధరలు ప్రజలకు చుక్కలను చూపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో టమాటాల ధర కిలో రూ.180 నుంచి రూ.300 వరకూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి టమాటాలు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.
'సింధు'పైనే ఆశలు
సింధు ప్రాంతం నుంచి మరికొన్ని వారాల్లో టమాటా, ఉల్లి పంటలు మార్కెట్లోకి వస్తాయని పాక్ భావిస్తోంది. అప్పటి వరకు ఇరాన్ దిగుమతులతో నెట్టుకురావచ్చని ఆలోచిస్తోంది.
కిలో రూ.17కే!...
ఓ వైపు టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పాక్ ప్రధాని ముఖ్య ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్ షేక్ మాత్రం భిన్నవాదన వినిపిస్తున్నారు. కరాచీ కూరగాయల మార్కెట్లో టమాటాలు రూ.17ల కన్నా తక్కువకే దొరుకుతున్నాయని సెలవిచ్చారు. అయితే ధరలు పెరిగిపోతున్నాయంటూ ప్రజలు అబద్ధాలు ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
స్వయంకృత అపరాధం
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్తో వ్యాపార సంబంధాలను పాకిస్థాన్ తెంచుకుంది. ఫలితంగా భారత్ నుంచి పాక్కు టమాటా దిగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది.
ఇదీ చూడండి: అక్టోబర్లో 4.62 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం